Kadapa : కడప పీఠం కదిలిపోయింది. సైకిల్ పార్టీ దెబ్బకు వైసిపి మేయర్ పీఠం వదులుకుంది. ఎమ్మెల్యే మాధవి రెడ్డి( MLA Madhavi Reddy ) ఛాలెంజ్ లో నెగ్గారు. తనకు కుర్చీ వెయ్యకపోవడానికి సహించుకోలేకపోయిన ఆమె గట్టిగానే బదులిచ్చారు. ఫైనల్ గా విజిలెన్స్ విచారణలో కడప మేయర్ అవినీతి బయటపడేలా చేశారు. మేయర్ సురేష్ బాబుపై పురపాలక శాఖ వేటు వేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. కడప శివంగి అనిపించుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించారు కడప రెడ్డమ్మ. తనను కుర్చీ లేకుండా అగౌరవపరిచిన మేయర్ కు కుర్చీ నుంచి దించేశారు. కడప నగరంపై టిడిపి జెండా ఎగురవేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు.
Also Read : ఆ జిల్లాలో కట్టు దాటుతున్న పసుపు నేతలు!
* కుర్చీ వేయకుండా అవమానం
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు రెడ్డప్ప గారి మాధవి రెడ్డి. దూకుడు మీద ఉన్న ఈ మహిళా నేత ఏకంగా డిప్యూటీ సీఎం పైనే గెలిచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తన దెబ్బ చూపించారు. జగన్( Jagan Mohan Reddy) సొంత ఇలాకాలో తన పవర్ చూపించారు. గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ ఎమ్మెల్యేగా గౌరవం ఇవ్వలేదు కడప మేయర్ సురేష్ బాబు. కౌన్సిల్ సమావేశంలో ఏకంగా ఎమ్మెల్యేకు కుర్చీ లేకుండా చేశారు. దీనిని అవమానంగా భావించారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి. మేయర్ సురేష్ బాబును గద్దె నుంచి దించుతానని గట్టిగానే ప్రతినబూనారు. చివరికి అనుకున్నది సాధించారు. విజిలెన్స్ విచారణలో 36 లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారని మేయర్ పై బలమైన ఆరోపణలు రాగా.. విజిలెన్స్ ఎంక్వయిరీలో నిజమని తేలడంతో మేయర్ పై వేటు పడింది. కేవలం తనకు కుర్చీ వేయకపోవడంతో.. మేయర్ సీటులో ఉన్న చైర్మన్ ను లాగేసారు.
* ఏకపక్షంగా గెలుపు..
కడప( Kadapa ) తదుపరి మేయర్ ఎవరు అన్నదానిపై బలమైన చర్చ నడుస్తోంది. కడప కార్పొరేషన్ లో 50 డివిజన్లు ఉంటే.. 49 డివిజన్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఒక్క డివిజన్లో మాత్రమే టిడిపి విజయం సాధించింది. మేయర్ గా సురేష్ బాబు, మొదటి డిప్యూటీ మేయర్ గా ముంతాజ్ బేగం, రెండో డిప్యూటీ మేయర్ గా నిత్యానంద రెడ్డి కొనసాగుతున్నారు. కడప కార్పొరేషన్ మేయర్ గా 2021 మార్చి 18న సురేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు. 2023 మే 15న మేయర్ సురేష్ బాబు కుమారుడు అమరేష్, సతీమణి జయశ్రీ పేరుతో కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్లుగా కడపలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఇప్పుడు ఆ సంస్థకు కడప కార్పొరేషన్ పరిధిలో పెద్ద ఎత్తున పనులు అప్పగించారు. విజిలెన్స్ విచారణలో అవినీతి బయటపడడంతో మేయర్ సీటుకు అసలు పెట్టింది రాష్ట్ర పురపాలక శాఖ. వెంటనే మేయర్ స్థానం నుంచి ఆయనని తొలగిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
Also Read : కడప కార్పొరేషన్ లో ‘కుర్చీ’ ఆట.. ఎమ్మెల్యే వర్సెస్ మేయర్!
* ఏడుగురు కార్పొరేటర్లు టిడిపిలోకి..
కడప కార్పొరేషన్ లో( Kadapa Corporation ) మేయర్ పద్ధతి నచ్చక ఓ ఏడుగురు కార్పొరేటర్లు టిడిపిలో చేరారు. మరి కొంతమంది టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే మాధవి రెడ్డితో చాలామంది టచ్ లో ఉన్నట్లు సమాచారం. కొత్త మేయర్ అనే చర్చలో మొదటి డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ముంతాజ్ భర్త కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టిడిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డితో టచ్లో ఉన్నట్లు సమాచారం. ముంతాజ్ బేగం మేయర్ పదవి అలంకరించడం ఖాయంగా తెలుస్తోంది. కేవలం ఒక మహిళా ఎమ్మెల్యేకు సీటు కేటాయించకపోవడంతో.. మేయర్ సీటుకు ఎసరు వచ్చిందన్న టాక్ నడుస్తోంది.