Janasena Party : మరోసారి విశాఖ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇక్కడ రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని టిడిపి తో పాటు జనసేన ఆశిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన చాలామంది నేతలు ఇప్పుడు కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అడారి ఆనంద్ కుమార్ టిడిపిలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. పూర్వాశ్రమంలో ఆయన కుటుంబం టిడిపిలోనే సుదీర్ఘకాలం కొనసాగింది. ఆనంద్ కుమార్ తండ్రి తులసీరాం విశాఖ డెయిరీ వ్యవస్థాపకులు. పబ్లిక్ ప్రైవేట్ రంగంలో.. సహకార సంస్థగా విశాఖ డైరీ ని రాష్ట్రస్థాయిలోనే ఉత్తమ సంస్థగా తీర్చిదిద్దారు. దానికి చైర్మన్ గా ఉంటూనే తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో కొనసాగుతూ వచ్చారు. 2004లో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ డైరీ పై దృష్టి పెట్టారు. అన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. కానీ చైర్మన్ గా ఉన్న తులసి రావు భయపడలేదు. టిడిపిలోనే కొనసాగారు. అయితే ఆయన అకాల మరణంతో సంస్థ బాధ్యతలను కుమారుడు ఆనంద్ కుమార్ తీసుకున్నారు. ఆయన సైతం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. వైసీపీ నుంచి వచ్చిన బెదిరింపులతో కొద్ది కాలానికి ఆ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో విశాఖపట్నం అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
* విశాఖ డెయిరీకి సింహాచలం బాధ్యతలు
టీటీడీ లడ్డు వివాదం నేపథ్యంలో.. రాష్ట్రంలో పేరు మోసిన దేవస్థానాలకు.. నెయ్యి సరఫరా చేసే డైరీల వివరాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో విశాఖలోని సింహాచలం దేవస్థానానికి.. ఆనంద్ కుమార్ నేతృత్వం వహిస్తున్న విశాఖ డైరీ నుంచి నెయ్యి సరఫరా జరుగుతున్నట్లు బయటకు వచ్చింది. దీంతో ఆనంద్ కుమార్ తిరిగి టిడిపికి చేరువ అవుతున్నట్లు ప్రచారం ప్రారంభమైంది. సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ అధినాయకత్వం అలర్ట్ అయింది. విశాఖపట్నం నియోజకవర్గ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ కు అప్పగించింది. దీంతో ఆనంద్ కుమార్ టిడిపిలో చేరిక దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
* ఆనంద్ కుమార్ పై దృష్టి
అయితే తాజాగా ఆనంద్ కుమార్ పై జనసేన దృష్టి పెట్టింది. విశాఖ డైరీ మాటున ఆడారి ఆనంద్ కుమార్ కుటుంబం నిలువు దోపిడీకి పాల్పడిందంటూ జనసేనకు చెందిన కార్పొరేటర్ పీ తల మూర్తి యాదవ్ ఆరోపణలు చేశారు. దాదాపు రాష్ట్రస్థాయిలో వివాదాస్పదం అయిన అంశాలన్నింటినీ పితల మూర్తి యాదవ్ బయటపెట్టారు. ఇప్పుడు కూడా ఆయన అడారి ఆనంద్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేయడంతో.. ఆయన టిడిపిలో చేరకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం అని ప్రచారం సాగుతోంది.