https://oktelugu.com/

Rushikonda Buildings : ‘రుషికొండ’ను మరిచిన ప్రభుత్వం.. రోజుకు లక్ష ఖర్చు.. ఇలా అయితే ఎలా?

విశాఖ నగరానికి ల్యాండ్ మార్క్ రుషికొండ. కానీ గత వైసిపి ప్రభుత్వం స్వరూపాన్ని మార్చేసింది. కనీస ఆనవాళ్లు లేకుండా చేసింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటుతున్నా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : October 7, 2024 / 11:00 AM IST

    Rushikonda Buildings

    Follow us on

    Rushikonda Buildings : విశాఖ రుషికొండ భవనాల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం ఏంటి? ప్రభుత్వపరంగా వినియోగిస్తారా? ప్రైవేటుకు అప్పగిస్తారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోంది. ప్రభుత్వపరంగా చాలావరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ రుషికొండ విషయంలో మాత్రం ఇంతవరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రుషికొండ కట్టడాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటివరకు కూటమి ప్రభుత్వం విధించిన ఆంక్షలు కొనసాగాయి. కానీ స్థానిక శాసనసభ్యుడు హోదాలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. ప్రత్యేకంగా తన బృందంతో రుషికొండను సందర్శించారు. అక్కడ ఖరీదైన నిర్మాణాలను బయటపెట్టారు. మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్ అయ్యింది. దాదాపు 500 కోట్లతో నిర్మించిన ఈ భవనాలలో.. ప్రతి నిర్మాణం అద్భుతమే. అయితే వీటి విషయంలో కూటమి ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటుందని ప్రచారం సాగింది. కానీ నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మంత్రి నారా లోకేష్ విశాఖలో పర్యటించినా రుషికొండ వైపు అస్సలు చూడలేదు. సీఎం చంద్రబాబు సైతం పర్యాటకశాఖ పై పలుమార్లు సమీక్షలు చేశారు. కానీ రుషికొండ భవనాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ భవనాలను ఎలా వినియోగిస్తారు అన్నది ప్రశ్నార్ధకంగా మిగిలింది.

    * ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ పరిధిలో
    ప్రస్తుతం రుషికొండ భవనాలు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్నాయి. కానీ వీటిని ఎలా నిర్వహించాలో కూడా అంతుచిక్కడం లేదు. వీటి నిర్వహణకు నైపుణ్యం గల సిబ్బంది అవసరం. కానీ ఆశించిన స్థాయిలో సిబ్బంది లేరు. వీటిని రిసార్టులకు కేటాయించినా అక్కడి నిర్మాణాలు అందుకు అనుగుణంగా లేవు. దీంతో వచ్చే ఆదాయం కంటే నిర్వహణ తీవ్ర భారం అవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రోజుకు సగటున లక్ష ఖర్చు దాటుతోందని.. ఏడాదికి నాలుగు కోట్ల భారం పడుతోందని అధికార వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోంది. ఈ నాలుగు నెలల్లో నిర్వహణకు 50 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. అందుకే వీలైనంతవరకు నిర్వహణ భారం తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

    * నిర్వహణ భారం
    రుషికొండపై 9.88 ఎకరాల్లో సువిశాలమైన ఏడు భవనాలు నిర్మించారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వీటి నిర్వహణకు 100 మంది వరకు సిబ్బంది అవసరం. మరో 50 మంది షిఫ్ట్ ల్లో పనిచేయాలి. కానీ అంతమంది సిబ్బంది లేరు. మరోవైపు విద్యుత్ బకాయిలు సైతం పేరుకుపోయాయి. నెలకు సగటున ఆరు లక్షల రూపాయల వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నట్లు అక్కడ సిబ్బంది చెబుతున్నారు. ఈ పరిణామాల నడుమ రుషికొండ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మరి చంద్రబాబు సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.