YS Jagan : వైయస్ జగన్ సంచలన నిర్ణయం

YS Jagan ఎన్డీఏ లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అండతో జగన్ కు ఇబ్బందులు కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తారు చంద్రబాబు.

Written By: NARESH, Updated On : July 6, 2024 9:45 am

Jagan Delhi

Follow us on

YS Jagan : జగన్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా? శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా? కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారా? పార్లమెంట్లో అడుగు పెడతారా? అందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం పాలయ్యింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. తనకు దక్కిన 11 స్థానాలతో అసెంబ్లీలో అడుగుపెడితే ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయని.. అవమానాలు ఎదుర్కోక తప్పదని జగన్ అనుమానిస్తున్నారు. అందుకే అసెంబ్లీకి వెళ్లకూడదని భావిస్తున్నారు. అయితే దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి వ్యూహం మార్చారు. కడప లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్లో అడుగు పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే బోటా బోటి మెజారిటీతో ఎన్డీఏ నడుస్తోంది. ఇండియా కూటమి పుంజుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాజకీయాల్లో అడుగుపెడితే ఇబ్బందుల నుంచి గట్టెక్క వచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈరోజు సాయంత్రం జగన్ తాడేపల్లి నుంచి ఇడుపులపాయ వెళ్ళనున్నారు. అక్కడే రాత్రి బస చేయనున్నారు. ఉదయం వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని యోచనలో ఉన్నట్లు సమాచారం. సభలో సంఖ్యా బలం లేకపోవడంతో అసెంబ్లీకి వెళ్లడం శ్రేయస్కరం కాదని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరినా స్పీకర్ సానుకూల నిర్ణయం తీసుకోలేదు. పైగా చచ్చేంత వరకు జగన్ ను కొట్టాలి అని స్పీకర్ గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతోనే తాను స్పీకర్ ఎన్నికకు హాజరుకావడం లేదని జగన్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అందుకే ఇన్ని ప్రతికూలతల నడుమ అసెంబ్లీకి వెళ్లడానికి జగన్ ఇష్టపడట్లేదని తెలుస్తోంది.

జగన్ కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి తో రాజీనామా చేయించి.. ఆ స్థానంలో జరిగే ఉప ఎన్నికల్లో జగన్ నిలబడొచ్చని అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో తన రాజీనామాతో ఖాళీ అయిన పులివెందుల నియోజకవర్గంలో తల్లి విజయమ్మను బరిలో దింపుతారని తెలుస్తోంది. పులివెందుల నుంచి తల్లిని గెలిపించుకుని అసెంబ్లీకి పంపిస్తారని ప్రచారం పొలిటికల్ వర్గాల్లో బలంగా జరుగుతోంది.

ఎన్డీఏ లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అండతో జగన్ కు ఇబ్బందులు కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తారు చంద్రబాబు. పాత కేసులను తిరగ దోడడంతో పాటు కొత్త కేసులను సైతం బనాయిస్తారన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే కేంద్ర రాజకీయాల్లోకి వెళితే ఆ ఇబ్బందుల నుంచి కొంత అధిగమించవచ్చు అని జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఆలోచన ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.