https://oktelugu.com/

Btech Ravi: పులివెందులలో పోటీ నుంచి తప్పుకోనున్న జగన్ ప్రత్యర్థి

ప్రస్తుతం షర్మిల కడప పార్లమెంట్ స్థానం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఆమెకు మద్దతుగా వైయస్ సునీత నిలుస్తున్నారు. ఇద్దరు చెల్లెళ్లు ఇప్పుడు జగన్ కు సవాల్ విసురుతున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : April 6, 2024 12:33 pm
    Btech Ravi

    Btech Ravi

    Follow us on

    Btech Ravi: ఇప్పుడు అందరి దృష్టి కడపపై పడింది. వైయస్ షర్మిల కడప లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ వైసిపి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది.తెలుగుదేశం పార్టీ నుంచి భూపేష్ రెడ్డి బరిలో దిగుతున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ వివేకానంద రెడ్డి హత్య అంశం హైలెట్ కానుంది. దాని చుట్టూ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఇప్పటికే వైయస్ బిడ్డ వైపు ఉంటారా? వివేకను చంపిన వారి వైపు ఉంటారా? అంటూ షర్మిల కుటుంబ అభిమానులను కోరారు. దీంతో వివేక హత్య చుట్టూ కడపలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో కూటమి ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బరిలో దిగుతారని తెలుస్తోంది. భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు టిడిపి అభ్యర్థిగా ప్రకటిస్తారని సమాచారం.

    ప్రస్తుతం షర్మిల కడప పార్లమెంట్ స్థానం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఆమెకు మద్దతుగా వైయస్ సునీత నిలుస్తున్నారు. ఇద్దరు చెల్లెళ్లు ఇప్పుడు జగన్ కు సవాల్ విసురుతున్నారు. వివేకను హత్య చేసిన అవినాష్ రెడ్డికి టికెట్ ఎలా కేటాయించారని.. జగన్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు. దాదాపు వైయస్ కుటుంబమంతా ఇప్పుడు షర్మిలకు అండగా నిలబడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి వైయస్ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉందా అన్న ప్రచారం సాగుతోంది. అయితే అందరి చూపు సునీత వైపే కనిపిస్తోంది. కానీ పులివెందుల నుంచి ఆమె కాకుండా తల్లి సౌభాగ్యమ్మను బరిలో దించాలని చూస్తున్నట్లు సమాచారం.

    కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న షర్మిల.. విజయం సాధించాలంటే పులివెందుల నియోజకవర్గంలో సైతం గట్టి పోటీ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే అక్కడ సౌభాగ్యమ్మను ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. వివేక హత్య కేసు అంశం హైలెట్ అవుతున్న తరుణంలో ఆమె అయితే మంచి అభ్యర్థి అవుతారని.. జగన్ కు గట్టి పోటీ ఇస్తారని తెలుస్తోంది. ఇక్కడ టిడిపి అభ్యర్థిగా బీటెక్ రవి రంగంలోకి దిగుతున్నారు. గత మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం పై సతీష్ రెడ్డి అనే నేత పోటీ చేసేవారు. 2014లో టిడిపి అధికారంలోకి రావడంతో సదరు సతీష్ రెడ్డికి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇటీవలే ఆయన వైసీపీలో చేరిపోయారు. దీంతో దూకుడు కలిగిన బీటెక్ రవి టిడిపి కి అవసరం అయ్యారు. వివేక భార్య సౌభాగ్యమ్మ కాంగ్రెస్ అభ్యర్థి అయితే.. బీటెక్ రవి డ్రాప్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవి కార్యకలాపాలను పెంచారు. పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహిస్తున్నారు. ఇటువంటి సమయంలో సౌభాగ్యమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఓట్లు చీలి.. సీఎం జగన్ కు మెజారిటీ పెరిగే అవకాశం ఉంది. అందుకే సౌభాగ్యమ్మకు మద్దతుగా బీటెక్ రవి పోటీ నుంచి తప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.