Jagan Mohan Reddy : మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy) జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. తనకు సిఆర్పిఎఫ్ లేదా ఎన్ఎస్జి తో భద్రత కల్పించాలని జగన్మోహన్ రెడ్డి పిటీషన్ లో కోరారు. తనకు జెడ్ ప్లస్ భద్రత పునరుద్ధరించేలా.. కేంద్ర భద్రతా సిబ్బందితో సెక్యూరిటీ కల్పించాలన్న వినతిని పరిగణలోకి తీసుకునేలా కేంద్ర హోం శాఖను ఆదేశించాలని కోరారు. ఈ మేరకు ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషనర్ తరుపు న్యాయవాది నాగిరెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ భద్రత, స్వేచ్ఛ ప్రమాదంలో ఉందని.. అందుకే కేంద్ర హోం శాఖకు వినతులు సమర్పించామన్నారు. భద్రత కుదింపు పై హైకోర్టులో కూడా గతంలో ఓ పిటీషన్ దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు న్యాయవాది.
Also Raed : జగన్ ‘వర్క్ ఫ్రం బెంగళూరు’.. టైటిల్ అదుర్స్!
* అన్ని వైపు వాదనలు..
మరోవైపు కోర్టుకు పూర్తి వివరాలు అందించేందుకు కొంత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పొన్నారావు( Deputy Solicitor General ponna Rao ) కోరారు. అదే సమయంలో భద్రత విషయంలో జగన్మోహన్ రెడ్డి గతంలోనే పిటీషన్ వేసారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గుర్తు చేశారు. ఆ పిటిషన్ లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా పేర్కొన్నారని.. ఇంకా అది కోర్టులో పెండింగ్లో ఉందని తెలిపారు. అన్ని వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రతివాదులను ఆదేశించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, సిఆర్పిఎఫ్ డిజి, ఎన్ ఎస్ జి డిజి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కోర్టు నోటీసులు జారీచేసింది. వేసవి సెలవుల అనంతరం ఈ కేసును విచారిస్తామని న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి తెలిపారు. అప్పటివరకు విచారణను వాయిదా వేశారు.
* ప్రోటోకాల్ ప్రకారం..
సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. దీంతో ప్రోటోకాల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి భద్రతను కుదించారు. అయితే కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనిపై గతంలో గవర్నర్కు కలిసి వినతి పత్రం కూడా అందించారు. సెక్యూరిటీ విషయంలో లాభాలు ఉన్నాయంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డికి చట్టప్రకారం కల్పించాల్సిన భద్రతను కొనసాగిస్తున్నట్లు చెబుతోంది. హైకోర్టు ఈ పిటిషన్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి.
* అప్పట్లో చంద్రబాబుకు కూడా..
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సైతం అప్పటి విపక్ష నేత చంద్రబాబు భద్రతను తగ్గించారు. కానీ గతంలో అలిపిరిలో ఆయనపై నక్సల్స్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో నిబంధనల ప్రకారం కోర్టు ఆదేశాల మేరకు భద్రత కల్పించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కాదు. ఆ హోదా కూడా లేదు. అందుకే ఆయన భద్రతను కుదించారు. అయితే దీనిని అవమానంగా భావిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే న్యాయపోరాటం చేస్తోంది.
Also Read : అమరావతి విషయంలో చంద్రబాబును భయపెడుతున్న ఆంధ్రజ్యోతి ఆర్కే!