Y S Jagan Mohan Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ అధికారానికి దూరమై ఏడాది అవుతోంది. సరిగ్గా గత ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం తప్పలేదు. ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు. 11 సీట్లు రావడంతో సాంకేతికంగా ప్రతిపక్షంగా గుర్తించలేమని స్పీకర్ తేల్చేశారు. అయితే ఇంతటి అపజయం ఎదురవుతుందని భావించలేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ దారుణ పరాజయంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. అయితే ఈ ఏడాదిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుందా? అంటే మాత్రం మిశ్రమ స్పందన వస్తుంది. ప్రతిపక్షంగా ఆ పార్టీకి ప్లస్ కంటే మైనస్ అధికంగా కనిపిస్తున్నాయి.
* ఏదీ ప్రతిపక్ష పాత్ర?
రాజకీయ పార్టీలు( political parties) అన్నాక గెలుపు ఓటములు సహజం. గెలిస్తే అధికారాన్ని నిలబెట్టుకోవాలి. ఓటమి చవిచూస్తే అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. పోనీ ప్రతిపక్షంలోకి వెళ్ళాక అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన కృషి చేయడం లేదు. ముఖ్యంగా అధినేత జగన్మోహన్ రెడ్డి సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని కారణం చూపుతూ ఆయన అసెంబ్లీకి వెళ్లడం మానేశారు. సాధారణ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సభకు హాజరయ్యారు. ఆ సమయంలో కూడా ఆయన హావభావాలు ప్రత్యేకంగా మారాయి. తరువాత శాసనసభను బహిష్కరించడం కూడా నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు సభలో ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయో జగన్ కు తెలుసు. తనకు అంతకుమించి ట్రీట్మెంట్ ఉంటుందని భావించి జగన్మోహన్ రెడ్డి శాసనసభను బాయ్ కట్ చేశారన్న అనుమానాలు ప్రజల్లోకి బలంగా చేరాయి. ఆ పార్టీకి ప్రధానంగా అదే మైనస్ గా మారింది.
Also Read : రౌడీ షీటర్లు హత్య నిందితుల పరామర్శ కోసం తెనాలికి జగన్
* అప్పట్లో చంద్రబాబు అలా..
2019లో తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party) దారుణ పరాజయం ఎదురయింది. కేవలం 23 అసెంబ్లీ స్థానాలతో ఆ పార్టీ గట్టెక్కింది. అయినా సరే చంద్రబాబు హుందాగా శాసనసభకు వచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల నుంచి ఎదురైన అవమానాలను, నిలదీతలను ఎదుర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీశారు. అయితే చంద్రబాబు కుటుంబం పై వ్యక్తిగత దాడి చేయడంతోనే ఆయన మనస్థాపానికి గురయ్యారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడడంతోనే అసెంబ్లీని బహిష్కరించారు. మళ్లీ సభలో సీఎం గానే అడుగు పెడతానని శపథం చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవంగా సభలో అడుగుపెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్క ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడానికి మాత్రమే సభకు హాజరయ్యారు. ప్రతిపక్ష హోదా అన్న కారణంతో పూర్తిగా బాయ్ కట్ చేశారు. దీంతో ప్రజల్లో ఒక రకమైన అనుమానాలు ఆయనపై ఏర్పడ్డాయి. అధికార పక్షానికి అది ప్రచార అస్త్రంగా కూడా మారింది.
* ప్రజల మధ్యకు వచ్చింది తక్కువే..
జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy)ఈ ఏడాది కాలంలో ప్రజల మధ్యకు వచ్చింది చాలా తక్కువ. పార్టీ నేతలు అరెస్టులు జరిగినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, సీనియర్ నేతలు మృతి చెందినప్పుడు వారి కుటుంబాలకు మాత్రం పరామర్శకు వస్తున్నారు. కానీ మిగతా ప్రజా సమస్యలపై ఆయన పెద్దగా స్పందించడం లేదన్న విమర్శ ఉంది. అప్పుడెప్పుడో గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఆయన తాడేపల్లి కంటే బెంగళూరు ప్యాలెస్ లో ఎక్కువగా గడుపుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ముందు జిల్లాల పర్యటనకు వస్తున్నట్లు ప్రకటించారు. ఆరు నెలలు అవుతున్నా దానికి సంబంధించి కార్యాచరణ ఏమి ప్రారంభించలేదు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఇతర నేతలంతా కేసులు పాలవుతున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దూకుడుగా ఉండాల్సిన అధినేత జగన్మోహన్ రెడ్డి మెతక వైఖరి అనుసరిస్తున్నారు అన్న ఆవేదన పార్టీ శ్రేణుల్లో ఉంది. 2014 నుంచి 2019 మధ్య జగన్ మోహన్ రెడ్డి పోషించిన ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు కూడా అనుసరించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. మొత్తానికైతే ఏడాది కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత గుణపాఠాలు నేర్వలేదని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.