Date Fixed Cabinet Meeting : ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు క్యాబినెట్ భేటీ జరగనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఏడాది పాలన పూర్తవుతున్న తరుణంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని భావిస్తోంది. ఈ నెలలోనే రెండు కీలక పథకాలను అమలు చేయనుంది. ఆ పథకాలకు సంబంధించి ఈరోజు డేట్ ఫిక్స్ చేయనున్నారు. మరోవైపు అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా అమరావతిలోని జిఏడి టవర్ టెండర్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా ఈ పనులు పట్టాలెక్కించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే టెండర్లకు ఈ క్యాబినెట్ ఆమోదముద్ర వేయనుంది. దీంతో మంత్రివర్గ సమావేశానికి ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read : జూన్ 4న ఏపీ క్యాబినెట్ భేటీ
* నవ నగరాలు లక్ష్యం.. అమరావతిలో( Amravati capital ) నవ నగరాలు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ తొమ్మిది నగరాల్లో అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా నిధులు కేటాయించింది. దాదాపు కొన్ని నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. వాటికి ఆమోదముద్ర వేయనుంది ఏపీ క్యాబినెట్.ముఖ్యంగా hod 4 టవర్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. మరోవైపు రెండో దశలో 44 వేల ఎకరాల భూ సేకరణ పై కూడా చర్చించుకున్నారు. ఐదువేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి కూడా ఈ క్యాబినెట్లో తేల్చనున్నారు. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, మరో 2500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రియల్ హబ్ నిర్మాణ ప్రతిపాదనలకు కూడా క్యాబినెట్ ఆమోదించే అవకాశం ఉంది.
* ఇతర అంశాలకు సంబంధించి..
ఇతర కీలక అంశాలకు సైతం ఏపీ క్యాబినెట్( AP cabinet ) ఆమోదం తెలపనుంది. వివిధ ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు భూ కేటాయింపులపై క్యాబినెట్ లో చర్చించనున్నారు. తల్లికి వందనం పథకం వివరాలను సమీక్షించనున్నారు. జూన్ 21న విశాఖలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లపై కూడా మంత్రులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి సమీక్షించనుంది ఏపీ క్యాబినెట్. మొత్తానికైతే ఈరోజు క్యాబినెట్ సమావేశం లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.