IPL 2025 Final : సాల్ట్ 19 పరుగులకే అవుట్ కావడంతో.. విరాట్ కోహ్లీ మీద భారం పెరిగిపోయింది. మరో ఎండ్ లో మంచి మంచి బ్యాటర్లు ఉన్నప్పటికీ.. ఎందుకనో అందరికీ ఫోకస్ విరాట్ కోహ్లీ మీదనే ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో విరాట్ కోహ్లీ దుమ్ము రేపే స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. కొన్ని మ్యాచ్ లలో బౌలర్ల మీద తన ప్రతాపం చూపించాడు. అయితే అటువంటి ఆటగాడు ఫైనల్ మ్యాచ్ లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 35 బంతుల్లో మూడు ఫోర్ల సహాయంతో 43 పరుగులు చేశాడు. కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఓమర్ జాయ్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ అనవసరమైన షాట్ కు యత్నించి ఔటయ్యాడు.
విరాట్ అలా అవుట్ కావడంతో.. అతడి అభిమానులు, మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.. భారీగా షాట్లు కొట్టి.. ఫోర్ బోర్డును పరుగులు పెట్టించాల్సిన మ్యాచ్లో 35 బంతుల్లో 43 పరుగులు చేయడం ఏంటని ప్రశ్నించారు. పంజాబ్ బౌలర్లు పక్కా ప్రణాళికతో బంతులు వేశారని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించారు..” పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. ముఖ్యంగా పకడ్బందీగా బౌలింగ్ వేసి అదరగొట్టారు. విరాట్ కోహ్లీని అలానే అవుట్ చేశారు. అందువల్లే 200 స్కోర్ బెంగళూరు చేయలేకపోయింది. ఈ మైదానంపై 35 బంతులు ఎదుర్కొన్న తర్వాత కూడా 123 స్ట్రైక్ రేట్ ఏంటని” ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నించాడు. ” భారీగా పరుగులు చేయాల్సిన సందర్భంలో విరాట్ అవుట్ అయ్యాడు. వాస్తవంగా అతడు తన సహజ శైలిని కోల్పోయాడు. అందువల్లే బెంగళూరు జట్టు 200 స్కోర్ చేయలేకపోయిందని” ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. “విరాట్ గనుక భారీ స్కోరు చేసి ఉంటే చివరి ఓవర్ దాక మ్యాచ్ కొనసాగేది కాదు. కన్నడ జట్టు అభిమానులు ఊపిరి బిగపట్టి మ్యాచ్ చూసేవారు కాదు. వాస్తవానికి శశాంక్ సింగ్ కు ఇంకా రెండు బంతులు గనుక మిగిలి ఉంటే అప్పుడు మ్యాచ్ స్వరూపం కన్నడ జట్టు ఊహించిన విధంగా ఉండేది కాదని.. ఫలితం వేరే విధంగా వచ్చేదని” ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు.
Also Read : 9 సంవత్సరాల తర్వాత ఫైనల్ లోకి.. ఈసారి ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరుదే.. ఎలాగంటే
“బెంగళూరు గెలిచింది కాబట్టి సరిపోయింది. సుదీర్ఘకాలం తర్వాత ట్రోఫీని దక్కించుకుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఒకవేళ ఫలితం తేడాగా వస్తే ఇబ్బందిగా ఉండేది. వాస్తవానికి విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ ఏ అభిమాని కూడా ఆశించడు. విరాట్ కోహ్లీ బీభత్సానికి ప్రతీకగా ఉండాలి. ఫైనల్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోరు చేస్తేనే బాగుంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని” నెటిజన్లు పేర్కొంటున్నారు.