YS Jagan :  వైసిపిని నమ్మని జగన్.. చంద్రబాబు ఫెయిల్యూర్ పైనే ఆశలు!

ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చి అప్పుడే 70 రోజులు అవుతోంది. కొత్త ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. పాలనపై దృష్టి పెట్టింది. కానీ ఆ పాలనలో వైఫల్యాలు ఎండగట్టడంలో మాత్రం వైసిపి ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. ప్రభుత్వ వైఫల్యాల కంటే.. పార్టీ శ్రేణులకు భరోసా కల్పించడంలో సైతం వెనుకబడడం విశేషం.

Written By: Dharma, Updated On : August 21, 2024 3:45 pm

YS Jagan

Follow us on

YS Jagan : వైసిపి ఉనికిపై జగన్ ఆశలు వదులుకున్నారా?ఇప్పట్లో పార్టీ బలోపేతం అయ్యేలా కనిపించడం లేదా? కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తే చూద్దామని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో వైసిపి, బిఆర్ఎస్ ది ఒకే పరిస్థితి. అధికారంతో ఒక వెలుగు వెలిగాయి ఆ రెండు పార్టీలు. కానీ ఇప్పుడు రెండు పార్టీలు ప్రతిపక్షంలోకి చేరుకున్నాయి. కెసిఆర్ కు ప్రతిపక్ష నేత హోదా దక్కింది. కనీసం జగన్ కు ఆ హోదా కూడా లేదు. ఆ హోదా దక్కించుకున్న కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లడం లేదు. కానీ హోదా దక్కలేదని జగన్ అసెంబ్లీకి వెళ్లడం మానేశారు. అయితే ఓటమి నుంచి ఈ రెండు పార్టీలు గుణపాఠాలు నేర్వడం లేదు.మళ్లీ పూర్వ వైభవం వస్తుందని కేటీఆర్ పదేపదే చెప్పుకుని పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపుతున్నారు. అయినా సరే ఆ పార్టీ నుంచి నేతల జంపింగ్లు తప్పడం లేదు. పక్క పార్టీల్లో చేరుతున్నారు. వైసిపి విషయానికొస్తే మరి దిగజారుడుతనం కనిపిస్తోంది. కూటమి పార్టీలు ఏ ఒక్కరిని ఆహ్వానించడం లేదు. కానీ వైసీపీని నేతలు వీడుతున్నారు. బ్యాలెన్స్ గా ఉండిపోతాం కానీ.. వైసీపీలో మాత్రం ఉండలేం అని తేల్చి చెబుతున్నారు.కనీసం పార్టీని నిలబెట్టే ప్రయత్నం కూడా జగన్ చేయడం లేదు.అయితే ఇప్పుడే కదా ఓటమి ఎదురయింది.. అప్పుడే ఏం చేస్తాంలే అన్నట్టుంది ఆయన వ్యవహార శైలి. కొంచెం టైం చూసి పోరాడాలన్న స్థితిలోకి ఆయన వచ్చినట్టు ఉన్నారు.

* ఏపీలో ఉండరెందుకు?
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని జగన్ ఆరోపించారు.ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని.. వైసీపీశ్రేణులు హత్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చి అదే పాట పాడారు. కానీ ఆయన మాత్రం ఏపీలో ఉండడం లేదు. బెంగళూరు, తాడేపల్లి మధ్య షటిల్ సర్వీసులు నడుపుతున్నారు.శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పిన జగన్ బాధితులను పరామర్శించడం లేదు.కనీసం వారిని ఓదార్చే ప్రయత్నం చేయడం లేదు.

* పార్టీ శ్రేణులకు భరోసా కరువు
అసలు జగన్ రాష్ట్రంలో ఉండడానికి పెద్దగా ఇష్టం పెట్టుకోవడం లేదు. అటువంటప్పుడు పార్టీ శ్రేణులకు ఎవరు భరోసా ఇస్తారు. నిన్ననే భారీ ఓటమి ఎదురైంది. ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపాలి. అయితే శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపణలు చేశారు. రెడ్ బుక్ ప్రకారం వైసీపీ నేతలను వెంటాడుతున్నారని, వేటాడుతున్నారని, కేసులతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారని చెబుతున్నారు.కానీ వారికి అండగా నిలవాలన్న ప్రయత్నం మాత్రం చేయడం లేదు.

* తెలంగాణలో దూకుడుగా
తెలంగాణలో ఓటమి నుంచి బిఆర్ఎస్ ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటుంది. మళ్లీ తమ పార్టీ పుంజుకుంటుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దారుణ ఓటమి నుంచి ఎలా బయటపడాలి అన్న దానిపై తమిళనాడు వెళ్లి స్టడీ చేయనున్నారు. అక్కడ డిఎంకె సైతం ఇదే స్థాయిలో ఓటమిలను ఎదుర్కొంది. పడి లేచిన కెరటం మాదిరిగా అధికారంలోకి రాగలిగింది. అందుకే అక్కడ స్థితిగతులను తెలుసుకునేందుకు కేటీఆర్ బృందం అక్కడికి వెళ్ళనుంది. జగన్ మాత్రం ఇవేవీ చేయడం లేదు. చంద్రబాబు సంక్షేమ పథకాలను అమలు చేయరు. చేయలేరు కూడా అని అనుమానిస్తున్నారు. తిరిగి ఏపీ ప్రజలు తన వైపే చూస్తారని నమ్మకం గా ఉన్నారు. అందుకే రిలాక్స్ అవుతున్నారు. విదేశీ యాత్రలకు సిద్ధపడుతున్నారు.