Ap assembly : జగన్ కు వార్నింగ్.. చంద్రబాబుకి హింట్.. రఘురామకృష్ణంరాజు తక్కువ వాడివి కావయ్య!

రఘురామకృష్ణం రాజు.. పరిచయం అక్కర్లేని పేరు. ఏపీ రాజకీయాల్లో హేమాహేమీలు ఉన్నా.. రఘురామకృష్ణంరాజు శైలి వేరు. గత ఐదు సంవత్సరాలుగా వైసిపి తో పాటు జగన్ కు కొరకరాని కొయ్యగా మారారు. ఇప్పుడు టిడిపిలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. అదే వైసీపీని తీవ్రస్థాయిలో ఎండగట్టాలని చూస్తున్నారు. ఏ అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు.

Written By: Dharma, Updated On : July 22, 2024 1:26 pm
Follow us on

Ap assembly: ప్రస్తుతం జగన్ కు ఉన్న రాజకీయ ప్రత్యర్థుల్లో రఘురామకృష్ణంరాజు ఒకరు. వారి మధ్య వైరం అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేశారు రఘురామకృష్ణంరాజు. అత్యధిక మెజారిటీతో గెలిచారు. కానీ గెలిచిన ఆరు నెలలకే పార్టీ నాయకత్వాన్ని విభేదించారు. పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు. ప్రతిపక్షాలతో చేతులు కలిపారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరి.. ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. శాసనసభకు ఎన్నికయ్యారు. మంత్రి లేదా స్పీకర్ పదవి ఆశించారు. కానీ దక్కలేదు. ఇటువంటి తరుణంలో ఈరోజు ఏపీ అసెంబ్లీలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా ముద్రపడిన జగన్, రఘురామకృష్ణంరాజు కలుసుకున్నారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు కూడా. దీంతో వారి మధ్య ఏం చర్చ జరిగింది.. అన్నది హాట్ టాపిక్ గా మారింది.

* సమావేశాలకు జగన్ హాజరు..
టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈరోజు రెండోసారి అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. వెంటనే జగన్ పక్కనే రఘురామకృష్ణంరాజు కనిపించారు. జగన్ కు పలకరించారు. ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు. అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో మాత్రం తెలియడం లేదు. కొద్ది నిమిషాల పాటు మాట్లాడుకున్న తర్వాత వీరిద్దరూ తిరిగి యధావిధిగా గవర్నర్ ప్రసంగం వింటూ కనిపించారు. దీంతో వీరి కలయిక అసెంబ్లీలోనే కాదు బయట కూడా హాట్ టాపిక్ గా మారింది. ఏం మాట్లాడి ఉంటారని చర్చ కూడా ప్రారంభమైంది. ఏవేవో ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే ఏం మాట్లాడారన్నదానిపై స్పష్టత లేదు.
* ఐదేళ్లుగా వైసీపీకి రెబల్
గత నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ నేతలను రఘురామకృష్ణంరాజు టార్గెట్ చేసుకున్నారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం సైతం రఘురామకృష్ణం రాజును కేసులతో వెంటాడింది. ఒకసారి అరెస్టు కూడా చేసింది. అయితే దానిపైనే తాజాగా న్యాయం పోరాటం ప్రారంభించారు రఘురామకృష్ణం రాజు. వైసిపి ప్రభుత్వ హయాంలో తనపై హత్యాయత్నం చేశారంటూ జగన్ తో పాటు అప్పటి అధికారులపై కేసు పెట్టారు. తాజాగా గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అది జరిగి కొద్దిరోజులే అవుతోంది. ఇప్పుడు తాజాగా అసెంబ్లీలో జగన్ వద్దకు వెళ్లి మరి రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. అయితే పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారా? లేకుంటే ఏదైనా మాట్లాడారా అన్న చర్చ జరుగుతోంది. రఘురామకృష్ణం రాజు మంత్రి పదవి ఆశించారు. స్పీకర్ ఛాన్స్ ఇస్తారని భావించారు. కానీ ఏ పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో జగన్ తో మాటామంతీ ద్వారా చంద్రబాబుకు ఆయన భవిష్యత్తు సంకేతం ఇచ్చారా అన్న చర్చ బలంగా సాగుతోంది.
* జగన్ పై రఘురామ న్యాయ పోరాటం
తనపై జరిగిన దాడి గురించే కాదు..జగన్ అక్రమాస్తుల కేసులపై కూడా రఘురామకృష్ణంరాజు న్యాయ పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో గత ఐదేళ్లుగా తీసుకున్న నిర్ణయాలపై సైతం కోర్టుకు వెళ్లారు. మొన్నటికి మొన్న జగన్ ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజు.. పులిలా చెప్పుకునే జగన్ ప్రమాణస్వీకారం చేసే సమయంలో తన పేరును కూడా చెప్పుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అటువంటి రఘురామ ఇప్పుడు జగన్ వద్దకు వెళ్లి తప్పకుండా ఏదో వివాదాస్పద మాటలు అనే ఉంటారని.. కచ్చితంగా కవ్వింపు కామెంట్స్ అవుతాయని అంతా భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు సభకు రావాలని జగన్ ను రఘురామ కోరినట్లు తెలుస్తోంది. అందుకు తప్పకుండా తాను హాజరవుతారని జగన్ సమాధానం చెప్పినట్లు సమాచారం. మరోవైపు జగన్ పక్కనే తనకు కూర్చునే అవకాశం కల్పించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవును రఘురామ కోరినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే తన బద్ధ శత్రువు జగన్ వద్దకు వెళ్లి రఘురామకృష్ణంరాజు ఏం మాట్లాడారన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.