Homeక్రీడలుక్రికెట్‌Gautam Gambhir : తల వంచిన బీసీసీఐ..గౌతమ్ గంభీర్ మాటే చెల్లుబాటు.. టీమిండియా బౌలింగ్ కోచ్...

Gautam Gambhir : తల వంచిన బీసీసీఐ..గౌతమ్ గంభీర్ మాటే చెల్లుబాటు.. టీమిండియా బౌలింగ్ కోచ్ గా అతడి నియామకానికి గ్రీన్ సిగ్నల్..

Gautam Gambhir : ఐపీఎల్ లో కోల్ కతా జట్టును విజేతగా నిలపడంలో తీవ్ర కృషి చేసిన గౌతమ్ గంభీర్ కు టీమిండియా హెడ్ కోచ్ గా అవకాశం లభించింది. రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగియడంతో.. బీసీసీఐ అతడికి ఈ అవకాశం కల్పించింది. కోచ్ గా నియామకం అయిన వెంటనే గౌతమ్ గంభీర్ టీమిండియా పై తనదైన మార్క్ చూపిస్తున్నాడు. టీమిండియా లో మార్పులు చేర్పులు చేపడుతున్నాడు. 2026 t20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, 2027 వరల్డ్ కప్ సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే తన మిషన్ ను అమలు చేయడం మొదలుపెట్టాడు. జట్టు కూర్పు విషయంలో ఎవరి మాటా వినడం లేదు. తనదైన మార్క్ ప్రతి విభాగంలోనూ చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. మొదట్లో ఫీల్డింగ్, బౌలింగ్, ఫిట్ నెస్ కోచ్ ల విషయంలో కాస్త బీసీసీఐ గౌతమ్ గంభీర్ నిర్ణయాలను తోసి పుచ్చినప్పటికీ.. ఆ తర్వాత గౌతమ్ గంభీర్ చెప్పినట్టే వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అసిస్టెంట్ కోచ్ లుగా అభిషేక్ నాయక్, ర్యాన్ టెన్ డస్కౌటే ను తనకు అసిస్టెంట్ కోచ్ లుగా తీసుకున్న గౌతమ్ గంభీర్.. మిగతా విభాగాలలో కూడా తనకు నచ్చిన వారినే ఎంపిక చేసుకున్నాడని తెలుస్తోంది.

బౌలింగ్ కోచ్ గా అతడు..

టీమిండియా బౌలింగ్ కోచ్ గా మోర్నీ మోర్కెల్ కూడా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.. వాస్తవానికి బౌలింగ్ కోచ్ విషయంలో భారత జట్టుకు ఒకప్పుడు ఆడిన క్రికెటర్లనే ఎంపిక చేయాలని బీసీసీఐ భావించింది. కానీ ఈ విషయంలో గౌతమ్ గంభీర్ బీసీసీఐని లెక్కపెట్టలేదు. పైగా తన మిషన్ ఏంటో వివరించడంతో బీసీసీఐ కూడా తల వంచక తప్పలేదు. దీంతో మోర్కెల్ ను బౌలింగ్ విభాగంలో మరో కోచ్ గా నియమించక తప్పలేదు. జూలై 27 నుంచి శ్రీలంకతో భారత జట్టు మూడు టి20, మూడు వన్డేలు ఆడనున్న నేపథ్యంలో మోర్కెల్ ను బౌలింగ్ విభాగంలో మరో కోచ్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.

చర్చలు జరుగుతున్నాయి

మోర్నీ మోర్కెల్ ను తీసుకోవడం లాంఛనమే అయినప్పటికీ.. గౌతమ్ గంభీర్ తో బీసీసీఐ పెద్దలు జరుపుతున్న చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదని తెలుస్తోంది. అందువల్ల శ్రీలంక టోర్నీకి సంబంధించి తాత్కాలిక బౌలింగ్ కోచ్ గా సాయిరాజ్ బహుతులే ను నియమించారు. లంక తో ఆడే టోర్నీ మొత్తానికి అతడే బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తాడు. ప్రస్తుతం సాయిరాజు జాతీయ క్రికెట్ అకాడమీ లో వర్ధమాన క్రికెటర్లకు బౌలింగ్ లో మెలకువలు నేర్పిస్తున్నాడు. భారత జట్టు తరఫున అతడు రెండు టెస్టులు, నాలుగు వన్డేలు ఆడాడు. 1997లో భారత జట్టు తరఫున ఎంట్రీ ఇచ్చాడు. ఐదు వికెట్లు పడగొట్టాడు.. లెగ్ స్పిన్నర్ గా పేరుపొందిన సాయిరాజ్ బహుతులే కోచ్ గా పనిచేసిన అనుభవం ఉంది. 2014లో కేరళ క్రికెట్ జట్టుకు, 2017లో బెంగాల్ క్రికెట్ జట్టుకు కోచ్ గా వ్యవహరించాడు. 2018 ఐపిఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు స్పిన్ విభాగంలో కోచ్ గా సేవలందించాడు. శ్రీలంక టూర్ తర్వాత మోర్నీ మోర్కెల్ టీమిండియాకు బౌలింగ్ కోచ్ గా ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది.

శ్రీలంక టూర్ ముగిసిన తర్వాత..

శ్రీలంక టూర్ ముగిసిన తర్వాత సాయిరాజ్ నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లిపోతాడని తెలుస్తోంది. ఈ గ్యాప్ లో గౌతమ్ గంభీర్, బీసీసీఐ పెద్దలు సహాయక సిబ్బంది ఎంపికను పూర్తి చేస్తారని తెలుస్తోంది. బంగ్లాదేశ్ తో సెప్టెంబర్ లో భారత జట్టు ఆడే మ్యాచ్ ల ద్వారా నూతన సహాయక శిక్షణా సిబ్బంది తమ పని మొదలు పెడతారని తెలుస్తోంది. అయితే సహాయక సిబ్బంది నియామక విషయంలో మొదట్లో గౌతమ్ గంభీర్ నిర్ణయాన్ని తోసి పుచ్చిన బీసీసీఐ.. ఆ తర్వాత అతడి ఇష్టానికి వదిలేసినట్టు తెలుస్తోంది. 2026లో టి20 వరల్డ్ కప్, 2027లో వన్డే వరల్డ్ కప్, అంతకంటే ముందు ఛాంపియన్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ వంటి మెగా టోర్నీలు ఉన్న నేపథ్యంలో గౌతమ్ గంభీర్ తనకు నచ్చిన సిబ్బందిని నియమిస్తే.. టీమిండియా విజయాలకు కృషి చేస్తానని బీసీసీఐ పెద్దలకు చెప్పినట్టు తెలుస్తోంది. అందువల్లే అతడు నచ్చిన, మెచ్చిన సిబ్బందిని నియమించేందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version