YCP Leaders : ముఖం చూపని వైసీపీ నేతలు.. 50 నియోజకవర్గాల్లో కేడర్ కు కష్టమే!

ప్రతి రాజకీయ పార్టీకి ఓటమి సర్వసాధారణం. ఓటమి ఎదురైనప్పుడు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది వైసిపి.

Written By: Dharma, Updated On : October 29, 2024 5:17 pm

YCP Leaders

Follow us on

YCP Leaders :  వైసీపీలో చాలామంది ఫైర్ బ్రాండ్లు ఉన్నారు. గత ఐదేళ్లలో ప్రత్యర్థులపై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. వారి నుంచి వచ్చే మాటలు తూటాల్లా ఉండేవి. వారంటేనే ఒక రకమైన భయం ఉండేది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీన్ మారింది. ఈ ఫైర్ బ్రాండ్లంతా ఓడిపోయారు. ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేదు. క్యాబినెట్లో 24 మంది మంత్రులు ఘోరంగా ఓడిపోయారు. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. వై నాట్ 175 అన్న నినాదం చేశారు వైసీపీ నేతలు. కానీ 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు. దీంతో పార్టీలో ఒక రకమైన నిర్లిప్తత కనిపించింది. పార్టీకి భవిష్యత్తు లేదనుకున్న వారు గుడ్ బై చెబుతున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితులు కూడా పార్టీని వీడుతున్నారు. అయితే అధికార మదంతో వ్యవహరించిన వారు మాత్రం ఏ పార్టీలోకి వెళ్లలేక పోతున్నారు.అలాగని సొంత నియోజకవర్గానికి ముఖం చూపించడం లేదు. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వంపై చిన్నపాటి విమర్శలు చేస్తున్నారు. తరువాత కనుమరుగు అవుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న.. జగన్ వెంట ఎవరూ కనిపించడం లేదు. అప్పుడప్పుడు వచ్చి కొన్ని సమావేశాల్లో మాత్రం కనిపిస్తున్నారు. తరువాత వారి జాడ లేకుండా పోతోంది. ముఖ్యంగా వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతలు నియోజకవర్గాలకు దూరంగా ఉండటం విశేషం.

*గుడివాడ అంటే కొడాలి నాని.. కొడాలి నాని అంటే గుడివాడ అన్నట్టు పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టలేకపోతున్నారు నాని. మొన్నటికి మొన్న గుడివాడలో కొడాలి నాని జన్మదిన వేడుకలకు అనుమతి లేకుండా పోయింది. ప్రస్తుతం కొడాలి నాని హైదరాబాదులో ఉన్నట్లు తెలుస్తోంది. మధ్య మధ్యలో విజయవాడ వచ్చి పోతున్నారు. కానీ గుడివాడ మాత్రం వెళ్లడం లేదు. గుడివాడలో పార్టీ కార్యాలయంలో సైతం పెద్దగా కనిపించడం లేదు. ఆయన అనుచరులు సైతం చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయినట్లు తెలుస్తోంది.

* గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జాడ కూడా లేదు. ఈ ఎన్నికల్లో భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు వంశీ. అప్పటినుంచి గన్నవరంలో అడుగుపెట్టడం లేదు. ఆయన అమెరికా వెళ్ళిపోయినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ మధ్యలో ఒక ప్రెస్ మీట్ లో కొడాలి నాని పక్కనే కనబడ్డారు. అయితే హైదరాబాదులో ఉంటూ అప్పుడప్పుడు విజయవాడ వస్తున్నట్లు తెలుస్తోంది.

* మాజీ మంత్రి ఆర్కే రోజా సైతం సొంత నియోజకవర్గం నగిరి కి ముఖం చాటేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆమె నగిరిలో అడుగుపెట్టలేదని సమాచారం. ఇటీవల ఆమె వైసీపీ అధికార ప్రతినిధిగా నియమితులైన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు. నేరుగా విలేకరుల సమావేశం అంటూ ఏర్పాటు చేయడం లేదు. ఆమె సిఫారసులతో జగన్ కొంతమంది వైసీపీ నేతలు పై చర్యలు తీసుకున్నారు. అయినా సరే ఆమె నగిరి లో అడుగు పెట్టకపోవడం విశేషం.

* అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన మాజీమంత్రి ఉషశ్రీ చరణ్ సైతం సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టడం లేదు. గత కొంతకాలంగా ఆమె బెంగళూరుకు పరిమితం అయినట్లు తెలుస్తోంది. ఆమె కోసం పనిచేసిన అనుచరులు ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఎందుకో ఆమె రావడం లేదు. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో పరిస్థితి అలానే ఉంది. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులు ఎవరు నియోజకవర్గాల్లో అడుగుపెట్టడం లేదు. దీంతో పార్టీ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి.

* రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 నియోజకవర్గాల్లో ఇన్చార్జిలు ఇంతవరకు సమీక్షలు చేయలేదని తెలుస్తోంది. ఓటమికి ఎదురైన పరిస్థితులపై ఇంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 80 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు జగన్. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన నేతలు తమ సొంత ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారు. దీంతో చాలా నియోజకవర్గాల్లో అస్పష్టత కొనసాగుతోంది. తమ నాయకుడు ఎవరన్నది కూడా వారికి తెలియడం లేదు. అందుకే నియోజకవర్గాల్లో దారుణ పరిస్థితి నెలకొంది.