Homeఆంధ్రప్రదేశ్‌Harirama Jogaiah And Mudragada: పెద్ద కాపులు జోగయ్య, ముద్రగడ.. కాపుల్లో వీరి బలమెంత?

Harirama Jogaiah And Mudragada: పెద్ద కాపులు జోగయ్య, ముద్రగడ.. కాపుల్లో వీరి బలమెంత?

Harirama Jogaiah And Mudragada: ఏపీలో కాపు సామాజిక వర్గం అధికం. సంఖ్యా బలంగా ముందున్నా.. ఆ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తేవడంలో జరుగుతున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. తొలిసారిగా కాపులను ఏకతాటి పైకి తీసుకొచ్చేందుకు దివంగత వంగవీటి మోహన్ రంగ మంచి ప్రయత్నం చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆయన కాపుల ఆరాధ్య దైవంగా మారారు. ఆయన కానీ దారుణ హత్యకు గురి కాకుంటే కాపుల చిరకాల వాంఛ అయిన ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకునేవారు.ఆయన మరణం కాపు జాతికి లోటే. రాజ్యాధికారం దక్కించుకోవాలన్న కాపుల ఆకాంక్షకు అనుగుణంగా ఆయన చేసిన ప్రయత్నంలో ఆయన హత్యకు గురయ్యారు. ఆయన మరణానంతరం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కాపు జాతి ఏకతాటి పైకి రావడం కష్టంగా మారింది.

అయితే కాపుల కోసం జరుగుతున్న ప్రయత్నంలో కొంతమంది నేతల తప్పటడుగులు శాపంగా మారాయి. తెలుగుదేశం పార్టీతో విభేదించి కాపు రిజర్వేషన్ ఉద్యమం వైపు ముద్రగడ పద్మనాభం అడుగులు వేశారు. కానీ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. ఆయన సైతం ఏపీ రాజకీయాల్లో ఒక పావుగా మారిపోయారు అన్న కామెంట్ ఉంది. 2009లో ప్రజారాజ్యం రూపంలో ఒక అరుదైన అవకాశం వచ్చినా… కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఆ ఎన్నికల్లో చిరంజీవికి ఎటువంటి మద్దతు తెలపలేదు. కాపుల మనసు దోచుకున్నా.. ఏకపక్షం మద్దతు కూడగట్ట లేకపోయింది.

రాష్ట్ర విభజనతో ఏపీలో కాపులదే అధికారం అని నమ్మకం వచ్చింది. కానీ రాష్ట్రంలో తెలుగుదేశం, వైసిపి ఆడిన నాటకంలో కాపు నాయకులు పావులుగా మారిపోయారు. 2014లో టిడిపిని, 2019లో వైసీపీని కాపులు ఆదరించారు. కానీ అక్కడ జనసేన అనేది ఒకటి ఉందని గుర్తించలేకపోయారు. రెండు బలమైన కాపు నియోజకవర్గాల్లో పోటీకి దిగిన పవన్ కళ్యాణ్.. రెండు చోట్ల ఓడిపోవడం అన్యాయం. అటు పవన్ ప్రస్తుతం దీనిపైన ఎక్కువగా మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కనీసం తనను గుర్తించలేదని.. ఇప్పుడు మాత్రం తనను ప్రశ్నిస్తున్నారని.. తమ వాడు అని భావించినప్పుడు తనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీపై లేదా అని పవన్ ప్రశ్నిస్తున్నారు. అందుకే మీకు తనను ప్రశ్నించే అధికారం లేదని తేల్చి చెబుతున్నారు. ప్రధానంగా కాపు పెద్దలుగా భావించే హరి రామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్లను పవన్ కళ్యాణ్ తప్పుపడుతున్నారు. తనకు ఎవరు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన పనిలేదని తేల్చి చెబుతున్నారు. నా పార్టీకి నాకు వ్యూహాలు ఉన్నాయంటూ కొట్టి పారేస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ ను నిత్యం లేఖలతో ఇబ్బంది పెడుతున్న హరి రామ జోగయ్య, ముద్రగడ పద్మనాభములపై బలమైన చర్చ నడుస్తోంది. అసలు వారి వెంట కాపు కులం ఉందా? కాపు కులం కోసం వారు ఏనాడైనా చిత్తశుద్ధితో పని చేశారా? అన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఈ ఇద్దరు నేతలు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. కీలక పదవులు అలంకరించారు. ఆ సమయంలోవీరికి కాపులు గుర్తుకు రాలేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేవలం వీరి వ్యక్తిగత ఉనికి కోసమే పవన్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కాపులు అనుమానిస్తున్నారు. ఈ ఇద్దరు కాపు నేతల ప్రభావం సామాజిక వర్గంపై ఉండదని.. పవన్ క్రేజ్ ను వీరి మాటలు దెబ్బతీయ లేవని జన సైనికులు తేల్చి చెబుతున్నారు.

అయితే కాపు పెద్దలుగా చలామణి అవుతున్న ఈ ఇద్దరు నేతల వెనుక అధికార పార్టీ ఉందన్న అనుమానం బలపడుతోంది. హరి రామ జోగయ్య సైతం వైసీపీలో కొద్దిరోజులు యాక్టివ్ గా పని చేశారు. అటు ముద్రగడ సైతం వైసీపీ కోసం పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే వీరు సంధిస్తున్న లేఖాస్త్రాలకు కాపుల నుంచి పెద్దగా స్పందన లేదు. అలాగని వీరికి కాపుల్లో ఆశించిన స్థాయిలో చరిష్మ లేదు. అందుకే పవన్ ను అడ్డం పెట్టుకొని.. సామాజిక వర్గం ముద్రచూపి రాణించాలని చూస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో వర్కౌట్ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే కాపు వృద్ధ నేతలు చేస్తున్న ప్రయత్నాలకు పవన్ ఎప్పటికప్పుడు చెక్ చెబుతూ వస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version