Pawan Kalyan: పవన్ ట్రాప్ లో వైసీపీ పడిందా? జాగ్రత్తగా ముగ్గులోకి దించారా? వారి వీక్ నెస్ తో రాజకీయం చేస్తున్నారా? పవన్ కు విపరీతమైన సానుభూతి వస్తోందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చగా నడుస్తోంది. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం జగన్ కు అండగా నిలిచింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాతఆ వర్గాన్ని జగన్ పక్కన పెట్టారు? ఇలా అనేదానికంటే చేజేతులా వదులుకున్నారు. దీనికి ముమ్మాటికీ కారణం పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడని కాపు సామాజిక వర్గంలో విపరీతమైన సానుభూతి ఉంది. అనవసరంగా జగన్ ను నమ్మి పవన్ ను ఓడించామన్న బాధ వారిలో విపరీతంగా ఉంది. సరిగ్గా ఇదే సమయంలోనే వైసీపీకి చెందిన కాపు నేతలతో తిట్టించారు. దీంతో కాపు సామాజిక వర్గ యువతలో ఒక రకమైన కసి ప్రారంభమైంది. అదే పవన్ కళ్యాణ్ కు రక్షణ కవచంగా మారింది.
గత ఐదు సంవత్సరాలుగా పరిణామాలు నెమరు వేసుకుంటే… పవన్ పై వైసీపీ నేతల వ్యక్తిగత దాడి కనిపిస్తుంది. అయితే ఆ దాడి వైసీపీ శ్రేణులకు ఆత్మ సంతృప్తి ఇవ్వొచ్చు కానీ.. బలమైన కాపు సామాజిక వర్గాన్ని పవన్ కు దగ్గరగా చేసింది వారే. వారిని దూరం చేసుకుంది కూడా వారే. పవన్ ను వైసీపీ టార్గెట్ చేసుకోవడం అనేది ఒక వ్యూహాత్మక తప్పిదం. పవన్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎక్కడికి వెళ్లినా వేలాది మంది జనం వస్తారు. పైగా బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని తిడితే అభిమానులు, సొంత సామాజిక వర్గం వారు సహించలేరు. చివరకు గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన వారు సైతం క్రమేపి దూరం కావడానికి పవన్ ను టార్గెట్ చేసుకోవడమే కారణం.
అయితే సుదీర్ఘకాలం రాజకీయం చేసిన పవన్ సైతం ఈ విషయాన్ని గమనించారు. అందుకే అవసరం వచ్చినప్పుడల్లా వైసిపి పై ఓ రేంజ్ లో విరుచుకుపడేవారు. సీఎం జగన్ పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించేవారు. అయితే ఈ క్రమంలో వైసిపి నేతలు అంతకుమించి పవన్ పై అటాక్ చేసేవారు. వైవాహిక జీవితంతో పాటు ప్యాకేజీ స్టార్ అంటూ విరుచుకుపడేవారు. అయితే ఈ క్రమంలో వచ్చే విమర్శలు పవన్ కు ప్రయోజనం చేకూర్చినవే. ఈ తరహా విమర్శలను కాపు సామాజిక వర్గం తట్టుకునే వారు కాదు. వారంతా క్రమేపి పవన్ గూటికి చేరడం ప్రారంభించారు. జనసేనకు పట్టుదక్కడం లో ఆ పార్టీ చేసే ప్రయత్నం కంటే.. వైసీపీ చర్యలతోనే జనసేన బలపడింది. ఇది ముమ్మాటికీ నిజం.
తాజాగా పవన్ ఒక స్ట్రాటజీగా ముందుకు సాగారు. గత ఎన్నికల్లో తనను నిరాదరించి జగన్ వైపు వెళ్ళిన కాపు సోదరులకు తప్పును గుర్తు చేశారు. తన వైవాహిక జీవితం విషయంలో జగన్ చేసిన కామెంట్స్ ను తప్పు పడుతూ.. తిప్పి కొట్టారు. అయితే ఆ విషయంపై వైసీపీ నేతలు ఓ రేంజ్ లో పవన్ పై విరుచుకుపడుతున్నారు. ఇటువంటి సమయంలో కాపులకు అసలు సినిమా అర్థం అవుతోంది. గత ఎన్నికల్లో జనసేనను విడిచి వైసీపీని మద్దతు తెలపడం తప్పిదమేనని గుర్తిస్తున్నారు. ఇప్పుడు అనవసరంగా పవన్ ను తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో 24 సీట్లు ఇచ్చారు అన్న అసంతృప్తిని మరిచిపోతున్నారు. మొత్తానికైతే పవన్ వ్యూహాత్మకంగా వైసీపీని ఇరుకున పెడుతున్నారు. వైసీపీ శ్రేణుల ఆవేశాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఎన్నికల వరకు ఇదే వ్యూహంతో ముందుకెళ్తే మాత్రం.. పొత్తులో తనకు లభించిన 24 సీట్లు గెలవడమే కాదు.. కూటమి విజయంలో సైతం పవన్ కీలకపాత్ర పోషిస్తారు అనడంలో సందేహం లేదు.