CM Chandhrababu : ఆ మూడింటితోనే వైసీపీకి మూడినట్టే.. చంద్రబాబుకు గోల్డెన్ ఛాన్స్.. మరి ఏం చేస్తారో?

వైసిపి ఓడిపోయింది. అధికారానికి దూరమైంది. ఆ పార్టీ నేతలకు కేసుల భయం వెంటాడుతోంది. అయితే టిడిపి కూటమి తలచుకుంటే కొత్త కేసులు అక్కర్లేదు. పాత కేసులను తిరగదోడితే మాత్రం జగన్ ఇట్టే దొరికిపోవడం ఖాయం.

Written By: Dharma, Updated On : July 31, 2024 1:52 pm
Follow us on

CM Chandhrababu : ఏపీలో కూటమి ప్రభుత్వానికి మంచి ఛాన్స్. వైసిపి నేతల గుట్టును రట్టు చేయగలిగితే ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి నూకలు చెల్లిపోయే ప్రమాదం ఉంది. వైసీపీ విపక్షం నుంచి అధికార పక్షానికి కార్యక్రమం లో ఎన్నో రకాల తప్పులు అప్పట్లో బయటపడ్డాయి. తప్పు ఆ పార్టీ చేస్తే.. మూల్యం చెల్లించుకున్నది మాత్రం ముమ్మాటికి టిడిపి ప్రభుత్వమే. 2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడానికిరెండే రెండు ప్రధాన కారణాలు. విశాఖ ఎయిర్పోర్టులో కోడి కత్తి దాడి, బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు.. ఈ రెండింటితోనే జగన్ ప్రజల సానుభూతి పొందగలిగారు. అంతులేని మెజారిటీతో గెలవగలిగారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు కేసులు మరుగున పడ్డాయి. జగన్ పై దాడి చేస్తే వైసిపికి విపరీతమైన సానుభూతి వస్తుందని.. టిడిపి పై వ్యతిరేకత ప్రారంభమవుతుందని ఈ ఘటనకు పాల్పడ్డానని కోడి కత్తి శ్రీను చెప్పుకొచ్చాడు. వివేకానంద రెడ్డి హత్య గురించి ఈ ఐదేళ్లుగా ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. గొడ్డలితో కిరాతకంగా తన ఇంట్లోనే నరికి చంపింది ఎవరో కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. కానీ ఈ రెండు కేసుల్లో నిందితులు, తెర వెనుక ఉన్న నేతలు, వారికి కావాల్సిన ప్రయోజనాలు.. ఇలా ఎన్నో రకాల మిస్టరీలకు కళ్ళు ఎదుటే సమాధానం ఉంది. రాజకీయ ప్రయోజనం పొందిన జగన్.. ఆ కేసులను కొలిక్కి తేవడానికి ఇష్టపడలేదు. ఒక కేసులో నిందితుడిని ఐదేళ్లపాటు రిమాండ్ ఖైదీగా ఉంచారు. మరో కేసులో నిందితులకు కొమ్ము కాసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు.

* కోడి కత్తి కేసు
కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ ఐదు సంవత్సరాల పాటు రిమాండ్ ఖైదీగా ఉండిపోయాడు. దేశంలో ఒక కేసులో రిమాండ్ ఖైదీ కి ఐదేళ్లపాటు జైలు జీవితం అంటే సామాన్యం కాదు. తాను ఒక సాధారణ మనిషిని కాదని.. సీఎం గా పాలనలో బిజీగా ఉన్నానని.. కోర్టుకు వచ్చేతీరిక లేదంటూ పలుమార్లు కోడి కత్తి కేసులో జగన్ తప్పించుకుంటూ వచ్చారు.కానీ ప్రతి సంవత్సరం వేసవి విడిదిలతో పాటు పిల్లలను చూసేందుకు విదేశాలకు వెళ్తుండేవారు. కానీ కోర్టుకు మాత్రం హాజరు కాలేదు. ఎటువంటి కుట్ర కోణం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ స్పష్టం చేసినా.. తనకు లోతైన దర్యాప్తు కావాల్సిందేనని చెప్పుకొచ్చారు జగన్. ఆ కేసును సీరియస్ గా దర్యాప్తు చేస్తే.. తెర వెనుక కథ, కథానాయకులు బయటపడే అవకాశం ఉంది.

* బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసు
2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు వివేకానంద రెడ్డి. ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కూడా. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సోదరుడు. గత ఐదు సంవత్సరాల పాటు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కు సొంత బాబాయ్. వివేకా హత్యను తొలుత గుండెపోటుగా చిత్రీకరించింది సాక్షి. తరువాత హత్యగా మార్చి సిబిఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు జగన్. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్నా కేసును కొలిక్కి తేకపోగా.. విచారణను అడుగడుగునా అడ్డగించారు. నిందితులకు కొమ్ముకాస్తూ కాపాడారు. ఈ కేసు పై కూడా సమగ్ర దర్యాప్తు చేస్తే తెరవెనుక నేతలు బయటపడే అవకాశం ఉంది.

* తాజాగా గులకరాయి కేసు
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పై విజయవాడలో గులకరాయితో దాడి చేశారు. దాడి చేసింది ఓ ఎస్సీ యువకుడని ఆరోపించారు. అరెస్టులు కూడా చేశారు. అయితే ఐదేళ్లలో నమ్మిన ప్రజలు.. ఎన్నికల ముందు చేసిన గులకరాయి దాడి ప్రచారాన్ని మాత్రం నమ్మలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సహజంగానే రాజకీయ ప్రత్యర్థులపై కేసులు మోపాలని చూస్తుంది. ఇప్పుడు గానీ ఈ పాత మూడు కేసులు తిరగదొడి.. సీరియస్ గా దర్యాప్తు చేస్తే మాత్రం జగన్ తో పాటు వైసీపీ నేతలు సైతం ఇట్టే దొరికిపోవడం ఖాయం. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.