YS Jagan : గత ఐదేళ్ల వైసిపి పాలనలో ప్రభుత్వం అంటే జగన్. జగన్ అంటేనే ప్రభుత్వం అన్న మాదిరిగా పరిస్థితి తయారయ్యింది. ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీని స్థాపించారు జగన్. అనుభవం లేకపోయినా.. కేవలం సెంటిమెంట్ అస్త్రంతోనే పార్టీని నడపగలిగారు. తొలుత ప్రతిపక్షంలో కూర్చున్నారు. తరువాత అధికారంలోకి వచ్చారు. కానీ ప్రజలు తనను చూసి అధికారం ఇచ్చారని.. మిగతా వారంతా నిమిత్తమాత్రులని.. తాను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని భావించారు. వాస్తవానికిప్రభుత్వం అంటే నమ్మకం,పాలకుడు అంటే భరోసా. పాలకులు మారుతారు కానీ ప్రభుత్వాలు మారవు. అందుకే ప్రభుత్వ విధానాలను ప్రజలు గౌరవిస్తారు. పాలకులే మారుతారు కానీ.. ప్రభుత్వపరంగా తమకు దక్కే హక్కులు ఎక్కడికి పోవు అన్నది ప్రజల అభిమతం.అభిప్రాయం కూడా.కానీ జగన్ అలా భావించలేదు.తానే శాశ్వతమని అనుకున్నారు.ప్రజల గుండెల్లో అభిమానం కాకుండా.. తననుగుడి కట్టుకొని పూజించాలని భావించారు. అందుకే పట్టాదారు పాస్ పుస్తకాలపై తన ఫోటో వేసుకున్నారు. సర్వే రాళ్లపై తన చిత్రాన్ని గీయించుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసి ప్రజలను తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని భావించారు. అలా భావించినందుకే ప్రజలు సహించుకోలేకపోయారు. 151 స్థానాలను..11 స్థానాలకు దించేశారు.కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. గౌరవం దక్కేలా ప్రజాతీర్పు లభించలేదు.ప్రతిపక్ష హోదా అడుక్కునే స్థాయికి జగన్ ను దిగజార్చింది ప్రజలే.కానీ అలా చేసింది మాత్రం ముమ్మాటికి జగనే.ఇందులో ప్రజల తప్పు పట్టలేము.
* అంతా రంగుల ప్రపంచం
ఓ ప్రభుత్వం, ముఖ్యమంత్రి బాగా పనిచేసే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి. కానీ జగన్ అలా అనుకోలేదు. సంక్షేమ పథకాలు ఇచ్చాం కనుక.. తాము ఏది చెప్పినా ప్రజలు వింటారు కనుక.. ఊరు వాడా రంగులతో నింపేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, బడులు, గూడులు, చివరకు స్మశాన వాటిక లకు సైతం పార్టీ రంగులు వేసేశారు. వీటన్నింటినీ ప్రజలు గమనించారు. ఈ రంగుల మాటున దుబారా ఖర్చులను గుర్తించారు. అందుకే ఓటు అనే ఆయుధంతో వాత పెట్టారు. జగన్ ను కోలుకోలేని దెబ్బతీశారు. తన తప్పిదాలను గుర్తు చేసేలా వ్యవహరించారు.
* ఇలా ప్రజల్లో ఉండాలనుకున్నారు
రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియ చేపట్టారు జగన్. భూ సమస్యల పరిష్కారానికి ఇదో చక్కటి కార్యక్రమంగా అభివర్ణించారు. కానీ కేవలం సర్వే రాళ్లకే 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ రాళ్లపై సైతం తన చిత్రాన్ని, పేరును లిఖించుకున్నారు. అదే సొమ్ముతో రైతులకు ప్రయోజన కారిగా ఈ కార్యక్రమం చేపట్టి ఉన్నా.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయేవారు. కానీ అక్కడ తాను ఒక్కడిని కాదని.. ప్రభుత్వం అంటేతాను ఒక్కడినే మాత్రమేనని జగన్ భావించారు.అందుకే తన పేరు ఉండాలని పరితపించారు.
* వారి సలహాలు స్వీకరించలేదే
వందలాదిమంది సలహాదారులను నియమించుకున్నారు. కానీ ఏ ఒక్కరి సలహాలను స్వీకరించే స్థితిలో లేకుండా పోయారు. ఆ పదవులు అనేవి వారికి కొలువులే తప్ప.. తనకు సలహాలు ఇచ్చేవారు ఎవరంటూకొట్టి పారేశారు.ప్రజలతోనే తనకు పని అని.. ప్రజలు నా మాట వింటారని భ్రమించారు. సంక్షేమ పథకాలతో తాను ఆరాధ్య దైవం అయ్యానని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలు తప్పాయి. మూల్యం చెల్లించుకునేలా చేశాయి. ప్రజలను హిప్నటైజ్ చేయాలని జగన్ చూశారు. కానీ జగన్ ను డైవర్ట్ చేసి .. తిరిగి ప్రజలు హిప్నటైజ్ చేశారు. ఓటుతో బుద్ధి చెప్పారు.