Housing Layouts: ఏపీలో( Andhra Pradesh) పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అనుమతులు లేని 870 పాత లేఅవుట్లకు తిరిగి అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. దీని ద్వారా సుమారు 85 వేల కుటుంబాలకు ఊరట దక్కనుంది. గతంలో స్థలాలు కొనుగోలు చేసినా.. అనుమతులు లేక ఇల్లు కట్టుకోలేని వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వం డెవలప్మెంట్ చార్జీలను సైతం రద్దు చేయడంతో ప్రజలపై భారం తగ్గనుంది. గతంలో చాలామంది అప్పుచేసి ఇళ్ల స్థలాలను కొనుగోలు చేశారు. అనుమతులు లేక ఇల్లు కట్టుకోలేకపోయారు. బ్యాంకుల్లో రుణం కూడా దొరికేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వారి కష్టాలు తొలగనున్నాయి.
Also Read: లక్నోపై “సూర్య”ప్రతాపం.. ఐపీఎల్ లో తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు
* 870 లేఔట్లకు అనుమతులు లేవు..
సాధారణంగా లేఅవుట్లు ( housing layouts )వేస్తే వాటికి అనుమతులు తప్పనిసరి. పట్టణాభివృద్ధి సంస్థలు నిబంధనల మేరకు ఉంటేనే అనుమతులు మంజూరు చేసేవి. కానీ చాలా రకాల అభ్యంతరాలతో 870 లేఅవుట్లకు అనుమతులు లేకుండా పోయాయి. అయితే ఆయా లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసిన వారు ఇల్లు కట్టుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. నిబంధనల ప్రకారం అనుమతులు లేకపోవడంతో బ్యాంకులు సైతం రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఈ లేఅవుట్ల విషయంలో మినహాయింపు ఇచ్చింది. అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఆయా లేఅవుట్లలో ఇల్లు కట్టుకునేందుకు మార్గం సుగమం అయింది.
* సిఆర్డిఏ పరిధిలో అధికం..
ముఖ్యంగా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ( సిఆర్డిఏ )( crda) పరిధిలో 624 లేఅవుట్లు ఉన్నాయి. అలాగే విఎంఆర్డిఏ పరిధిలో 182 లేఔట్లు ఉన్నాయి. శ్రీకాకుళం, తిరుపతి, కర్నూలు, పుట్టపర్తి తదితర ప్రాంతాల్లో కూడా కొన్ని లేఅవుట్లు ఉన్నాయి. వీటన్నింటికీ తాజాగా మోక్షం కలగనుంది. వాస్తవానికి నిబంధనల ప్రకారం లేఅవుట్ పనులు మూడేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. రోడ్లు, కాలువలు, స్ట్రీట్ లైట్స్ వంటి సదుపాయాలు కల్పించాలి. అప్పుడే తనకా పెట్టిన ప్లాట్ లను పట్టణాభివృద్ధి సంస్థలు విడుదల చేస్తాయి. కానీ 8509 ఎకరాల్లో వేసిన 870 లేఅవుట్లు గడువులోగా పనులు పూర్తి చేయలేదు. పైగా ఫీజులు అధికంగా ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం ముందుకు రాలేదు. దీనివల్ల ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడ్డారు.
* దరఖాస్తుల తిరస్కరణ..
అనుమతులు లేని లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. గత 12 సంవత్సరాల్లో దాదాపు పదివేల దరఖాస్తులను తిరస్కరించారు. ప్రధానంగా ఎల్.పి నంబర్( LP number) లేని కారణంగా బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడం లేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. అందుకే ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ కింద అనుమతులు పునరుద్ధరించే అవకాశం కల్పించింది. డెవలప్మెంట్ చార్జీలను కూడా రద్దు చేసింది. ఇప్పుడు పట్టణాభివృద్ధి సంస్థలు వ్యాపారులకు నోటీసులు ఇస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని లేఅవుట్ల అనుమతులు పునరుద్ధరించుకోవాలని సూచిస్తున్నాయి. అయితే ఇది చక్కటి అవకాశం అని.. సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: మొన్న శ్రేయస్ అయ్యర్.. నిన్న కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లీకి ఏమైంది?