Deputy CM Pawan Kalyan: రేవంత్ వెంట భట్టి.. చంద్రబాబు వెంట పవన్ లేరెందుకు?

ఏపీలో టీడీపీ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి సంపూర్ణ విజయం పొందింది. కూటమి గెలుపులో కూడా పవన్ క్రియాశీలక పాత్ర పోషించారు. అందుకే చంద్రబాబు సైతం పవన్ కళ్యాణ్ కు ఎనలేని ప్రధానిని ఇచ్చారు.

Written By: Dharma, Updated On : July 5, 2024 11:47 am

Deputy CM Pawan Kalyan

Follow us on

Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ ప్రాధాన్యత తగ్గిందా? చంద్రబాబు తగ్గించారా? ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ నడుస్తోంది. జనసైనికుల నుంచి కూడా ఇదే తరహా ఆవేదన వ్యక్తం అవుతోంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తున్న వారు తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపులు పవన్ కు చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. కానీ నెల రోజులు గడవకముందే కొన్ని రకాల పాలనాపరమైన అంశాల్లో పవన్ ప్రస్తావన లేకపోవడంపై జనసైనికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహంతో ఉన్నారు.

ఏపీలో టీడీపీ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి సంపూర్ణ విజయం పొందింది. కూటమి గెలుపులో కూడా పవన్ క్రియాశీలక పాత్ర పోషించారు. అందుకే చంద్రబాబు సైతం పవన్ కళ్యాణ్ కు ఎనలేని ప్రధానిని ఇచ్చారు. ఆయనకు మాత్రమే డిప్యూటీ సీఎం హోదా కట్టబెడుతూ నాలుగు కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ ఫోటోలు ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పవన్ కోసం ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయం తో పాటు నివాస గృహాన్ని కూడాఏర్పాటు చేయించారు. అయితే తొలినాళ్లలో ఇచ్చిన ప్రాధాన్యతను క్రమేపి తగ్గిస్తూ రావడం విశేషం. దీనిపైనే జనసైనికులు గగ్గోలు పెడుతున్నారు.

జూలై 1న రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియను వేడుకగా జరిపారు. పండగ వాతావరణం లో జరిపించారు. కానీ పెన్షన్ లబ్ధిదారులకు ఇచ్చిన కరపత్రాలలో పవన్ ఫోటో లేదని.. ప్రభుత్వం తరఫున ఇచ్చిన ప్రకటనల్లోనూ పవన్ కళ్యాణ్ ఫోటో లేదని జనసేన కార్యకర్తలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొందరైతే బాహటంగానే తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. జనసేన లేకపోతే కూటమి గెలుపు లేదని ఓ జనసేన మహిళా కార్యకర్త వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిశారు. దీనిపై కూడా జనసైనికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తన వెంట డిప్యూటీ సీఎం పవన్ ను తీసుకుని వెళ్లక పోవడాన్ని తప్పుపడుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను తీసుకెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనను పవన్ తీసుకువెళ్లకుండా ఆయన ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం మొదలుపెట్టారని చంద్రబాబుపై జనసైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.