Harirama Jogaiah: రాజకీయాలన్నాకా కొత్త పొత్తులు పొడుస్తాయి. పాత బంధాలు విడిపోతాయి. అవసరాల ఆధారంగా పాత పొత్తులు మళ్లీ అతుకుతాయి. ప్రస్తుతం ఏపీలో జరుగుతోంది ఇదే. 2014లో సైకిల్ సవారీ చేసిన పవన్ కళ్యాణ్.. భేదాభిప్రాయాలు ఏర్పడటంతో సైకిల్ దిగారు. ఆ తర్వాత మళ్లీ ఇటీవల సైకిల్ తో దోస్తీ కట్టారు. దోస్తీ వెనుక పరమార్థం ఏమిటో పవన్ కళ్యాణ్ చెప్పలేదు గాని.. ఏపీ బాగుపడాలంటే కచ్చితంగా టీడీపీతో కలిసి పోటీ చేయాలి అనే సంకేతాలు ఆయన పార్టీ శ్రేణులకు ఇచ్చారు. సహజంగానే ఒకసారి దెబ్బతిని ఉన్న జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ మాటలను ముందుగా పెడచెవిన పెట్టారు. ఆ తర్వాత ఒంట పట్టించుకున్నారు. పార్టీ ఏర్పాటు చేసి పది సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో.. ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ తో ప్రయాణం సాగించిన వారు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి అని భావించారు. టిడిపితో పొత్తు నేపథ్యంలో టికెట్ దక్కుతుందా? అనే సందేహం వారిలో నెలకొంది. ఇది ఇలా జరుగుతుండగానే పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కాపు సామాజిక వర్గానికి చెందిన చేగొండి హరి రామ జోగయ్య ఒక లేఖ రాశారు.
హరి రామ జోగయ్య రాసిన లేఖ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. “సోమవారం టిడిపికి చెందిన ఒక పత్రిక జనసేనకు సీట్ల కేటాయింపు జరిగిపోయిందని రాసింది. 27 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారని ప్రకటించేసింది. మరొక మీడియా సంస్థ జనసేనకు 33 సీట్లు దక్కాయని.. దీనికి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారని తేల్చిపడేసింది. అసలు దామోదరం సంజీవయ్య తర్వాత ఇప్పటివరకు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారెవరూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించలేదు. రెడ్డి కులానికి చెందిన జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అనేది పవన్ కళ్యాణ్ లక్ష్యం. అలాంటప్పుడు సొంతంగా ఎన్నికల్లోకి వెళ్ళలేడు. టిడిపి కూడా సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయలేదు. అలాగని జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కాదు కదా పవన్ కళ్యాణ్ ఉద్దేశం. రెండు పార్టీలకు ఎన్నికలు అత్యవసరమైనప్పుడు టిడిపి ఎన్ని సీట్లు కేటాయిస్తుంది అనేది ప్రశ్న కాకూడదు.. కానీ ఆ ప్రశ్నను ఎల్లో మీడియా సంధిస్తోంది. ఎల్లో మీడియా ఇలాంటి రాతలు పైనుంచి ఆదేశాలు రాకుండా రాయదు” అని రామజోగయ్య ఘాటుగా స్పందించారు.
రామజోగయ్య లేఖ రాసిన నేపథ్యంలో ఏపీలో రాజకీయాల్లో మరింత కాక రేగుతోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం వారు ఆగ్రహంతో ఉన్నారు. 2019 ఎన్నికలలో ఏపీలో 31 మంది కాపు సామాజిక వర్గానికి చెందినవారు శాసనసభ సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం కాపు సామాజిక వర్గం జనాభా తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ , గుంటూరు జిల్లాలో అధికంగా ఉంటుంది. రాయలసీమలో బలిజ సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. ఉత్తరాంధ్రలో తూర్పుకాపులు అధికంగా ఉంటారు. అలాంటప్పుడు టిడిపి వీరికి ఎన్ని సీట్లు కేటాయిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో రామ జోగయ్య సీట్ల కేటాయింపు పై పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. సామాజిక న్యాయం ప్రకారం జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో 2014 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందని హెచ్చరిస్తున్నారు. మరి దీనిని పవన్ కళ్యాణ్ ఏ విధంగా సరిదిద్దుకుంటారు ? ఎన్ని సీట్లు దక్కించుకుంటారు? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. అన్నట్టు ఇటీవలి కాలంలో హరిరామ జోగయ్య పలు మార్లు పవన్ కళ్యాణ్ కు లేఖలు రాశారు.