GV Reddy
GV Reddy : జీవి రెడ్డి ( GV Reddy) విషయంలో టిడిపిలో కొత్త చర్చ నడుస్తోందా? ఆయనను వదులుకునేందుకు టిడిపి క్యాడర్ సిద్ధంగా లేదా? నాయకత్వంపై ఒత్తిడి పెంచుతోందా? తిరిగి పార్టీలోకి తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కొద్దిరోజుల కిందట ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఫైబర్ నెట్ ఎండి తో జరిగిన వివాదం నేపథ్యంలో జీవి రెడ్డి పార్టీ పదవితో పాటు ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అయితే దీనిపై టిడిపిలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. జీవి రెడ్డికి టిడిపి సోషల్ మీడియా నుంచి మద్దతు లభిస్తోంది. ఆయనను పార్టీని వదులుకోవడం ఎంత మాత్రం మంచిది కాదని ఎక్కువ మంది సలహా ఇస్తున్నారు. తిరిగి పార్టీలోకి తీసుకురావాలని కోరుతున్నారు. దీంతో నాయకత్వం సైతం మెత్తబడినట్లు సమాచారం.
* అత్యంత క్లిష్ట సమయంలో
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party) దారుణంగా ఓడిపోయింది. ఆ సమయంలో పార్టీ నుంచి చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. పార్టీలో ఉన్నవారు సైతం సైలెంట్ అయ్యారు. పార్టీ వాయిస్ వినిపించేవారు సైతం కరువయ్యారు. టిడిపి నుంచి బయటకు వెళ్లిపోయే నేతలు తప్ప.. టిడిపిలోకి వచ్చే నేతలు ఎవరూ కనిపించలేదు. ఆ సమయంలోనే టిడిపిలో చేరేందుకు ముందుకు వచ్చారు జీవి రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన టిడిపిలో వచ్చేందుకు ముందుకు వచ్చారు. చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. పార్టీ అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు.
ALSO READ: అతడి వల్లే జీవీ రెడ్డి.. ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారా? టిడిపి శ్రేణులు ఏమంటున్నాయంటే?
* గత ఐదేళ్లుగా కృషి
గత ఐదు సంవత్సరాలుగా జీవి రెడ్డి(GV Reddy ) తెలుగుదేశం వాయిస్ వినిపించడంలో సక్సెస్ అయ్యారు. పార్టీ అధికార ప్రతినిధిగా పార్టీ విధానాలను చెప్పేందుకు ముందంజలో ఉండేవారు. టీవీ డిబేట్లో సైతం పాల్గొనేవారు. అక్కడ పార్టీ విధానాలను వివరించేవారు. చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించే వారు. ఒక్కమాటలో చెప్పాలంటే పార్టీకి వ్యూహకర్తల్లో ఒకరిగా మారారు. తెలుగుదేశం పార్టీ పట్ల రెడ్డి సామాజిక వర్గం వ్యతిరేకం అనే ప్రచారానికి చెక్ చెప్పారు జీవీ రెడ్డి. అటువంటి నేత ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడం.. అవమానకర రీతిలో నిష్క్రమించడాన్ని టిడిపి సోషల్ మీడియా విభాగం తప్పుపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు జీవి రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని కోరుతున్నాయి.
ALSO READ: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. నేతలు, అధికారులకు సంకేతాలు పంపిన చంద్రబాబు
* ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే..
ప్రస్తుతం ఫైబర్ నెట్ చైర్మన్( fibernet chairman ) పదవికి రాజీనామా చేశారు జీవీ రెడ్డి. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. అందుకే ముందుగా పార్టీలోకి రప్పించి ఆయనకు కీలక పదవి ఇవ్వాలని కోరుతున్నారు టిడిపి శ్రేణులు. ప్రస్తుతం 5 ఎమ్మెల్సీలకు ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. అందులో తప్పనిసరిగా మూడు ఎమ్మెల్సీ పదవులు టిడిపికి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే అందులో ఒక పదవి జీవి రెడ్డికి ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. తద్వారా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడమే కాకుండా.. రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేసినట్లు అవుతుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.