AP Fiber Net Chairmen GV Reddy
GV Reddy : జీవి రెడ్డి స్వతహాగా లాయర్ కావడంతో లాజిక్ ప్రకారం మాట్లాడేవారు. ఎదుటివారికి అవకాశం ఇవ్వకుండా లెక్కలతో సహా నాటి వైసిపి ప్రభుత్వాన్ని ఎండగట్టేవారు. జీవి రెడ్డి టిడిపిని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి కృషి చేశారు. ముఖ్యంగా యువతను టిడిపి వైపు లాగడంలో ఆయన విజయవంతమయ్యారు. టీవీ డిబేట్లలో టిడిపి తరఫున అద్భుతంగా మాట్లాడేవారు.. అందువల్లే ఆయన ఒక్కసారిగా టిడిపి రాష్ట్ర నాయకుల జాబితాలో చేరిపోయారు. టిడిపి అధికారంలోకి రావడానికి తన వంతు పాత్రను జీవి రెడ్డి పోషించారు. అందువల్లే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఫైబర్ నెట్ చైర్మన్ పదవి ఇచ్చారు.. ఫైబర్ నెట్ చైర్మన్ అయిన తర్వాత జీవీ రెడ్డి నాటి వైసిపి ప్రభుత్వం లో జరిగిన అవకతవకలను పలు సందర్భాల్లో బయటపెట్టారు. ఇక ఇటీవల రామ్ గోపాల్ వర్మ కేసులో సంచలన విషయాలను జీవీ రెడ్డి వెల్లడించారు. అంతేకాదు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఫైబర్ నెట్ ఎండి ఐఏఎస్ దినేష్ కు జీవి రెడ్డి మధ్య గ్యాప్ ఏర్పడింది.
ఫైబర్ నెట్ లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను చైర్మన్ హోదాలో జీవి రెడ్డి తొలగించారు. అయితే తన నిర్ణయానికి ఎండి దినేష్ ఆమోదముద్ర వేయకపోవడంతో జీవి రెడ్డిలో ఆగ్రహం తార స్థాయికి చేరింది. ఈ పంచాయతీ చంద్రబాబు దాకా వెళ్ళింది. అయితే వైసిపి సానుభూతిపరులను తాను తొలగించానని జీవీ రెడ్డి చెప్పగా.. చంద్రబాబు తోసిపుచ్చారని.. పైగా అధికారులతో కలిసి పని చేయాలని జీవి రెడ్డికి సూచించినట్టు తెలుస్తోంది. దీంతో తాను ఆరోపణలు చేసిన అధికారితో కలిసి పని చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పిన జీవి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఓ మీడియా అధినేత సోదరుడి కుమారుడు ఒత్తిడి మేరకే జీవి రెడ్డి రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. ఆ మీడియా అధినేత సోదరుడి కుమారుడు కూటమి ప్రభుత్వంలోని ఓ కీలక నాయకుడికి అత్యంత దగ్గరగా ఉంటాడని.. జీవి రెడ్డి ఉండడంవల్ల ఫైబర్ నెట్ లో తను అనుకున్న పనులు కాకపోవడంతో.. అతడు ఒత్తిడి తేవడంతోనే కూటమి ప్రభుత్వంలోని కీలక నాయకుడు జీవి రెడ్డి ని మందలించారని.. అందువల్లే ఆయన రాజీనామా చేశారని తెలుస్తోంది. పదవికి మాత్రమే కాదు.. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
చంద్రబాబుపై విమర్శలు
జీవి రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారు. ” జీవి రెడ్డి పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని ఒత్తిడులు ఎదురైనప్పటికీ తట్టుకున్నాడు. తనకిష్టమైన న్యాయవాద వృత్తిని కూడా పక్కన పెట్టాడు. యువతను ఆకర్షించాడు. టీవీ డిబేట్లలో పార్టీ వాయిస్ గట్టిగా వినిపించాడు. ఫైబర్ నెట్ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత అందులో జరిగిన అవకతవకలను బయటపెట్టాడు. చివరికి అండగా ఉండాల్సిన పార్టీ అధిష్టానం చేతులెత్తేసింది. ఫలితంగా అతడు రాజీనామా చేశాడు.. ఇలాంటప్పుడు పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటనేది మాకు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి దుస్థితిని ఎదుర్కోవాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందని” తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తన ప్రవర్తనను మార్చుకోవాలని.. పైన పక్షంలో ఇంకా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.