Visakha Railway Zone: విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. డిసెంబర్లో రైల్వే జోన్ కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ లో ఉన్నారు. ఈరోజు కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలవనున్నారు. రైల్వే జోన్ శంకుస్థాపనకు సంబంధించి ముహూర్తం ఖరారు చేయనున్నారు. దాదాపు 10 ఏళ్లుగా ప్రత్యేక రైల్వే జోన్ అంశం ఊరిస్తూ వస్తోంది. విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ కేటాయిస్తామని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విభజన హామీల్లో సైతం పొందుపరిచింది. అయితే అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరిగింది కానీ.. ప్రత్యేక రైల్వే జోన్ఏర్పాటు మాత్రం జరగలేదు. గత ఐదేళ్లలో వైసిపి పట్టించుకున్న పాపాన పోలేదు. రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. కానీ వైసీపీ ప్రభుత్వం సమకూర్చలేకపోయింది. దాని ఫలితంగా విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కార్యరూపం దాల్చలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో కేంద్రంలో టిడిపి కీలక భాగస్వామిగా మారింది. దీంతో విభజన హామీలకు మోక్షం కలుగుతూ వస్తోంది. అందులో భాగంగా ప్రత్యేక రైల్వే జోన్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కూటమి ప్రభుత్వంరైల్వే జోన్ కు అవసరమైన భూమిని సమకూర్చింది. విశాఖలో ఎటువంటి వివాదాలు లేకుండా ఉన్న మూడసర్లవలోని 52 ఎకరాలను రైల్వేకు అప్పగించడానికి ఏర్పాట్లు చేసింది. దీంతో రైల్వే జోన్ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది.
* కేంద్రమంత్రి స్పష్టమైన ప్రకటన
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టమైన ప్రకటన చేశారు. త్వరలో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అవుతుందని ప్రకటించారు. వాస్తవానికి 2018 లోనే కేంద్ర క్యాబినెట్ రైల్వే జోన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. కానీ ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈ అంశం తెర మరుగు అయ్యింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. తీవ్ర జాప్యం జరుగుతూ వచ్చింది. ప్రత్యేక రైల్వే జోన్ అంశాన్ని అస్సలు పట్టించుకోలేదు. అటు కేంద్రం సైతం రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూర్చకపోతే.. తమ తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించింది. అందుకే రైల్వే జోన్ ఏర్పాటు విషయాన్ని తేలిగ్గా తీసుకుంది.
* రామ్మోహన్ నాయుడు చొరవతో
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం.. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రి కావడంతో.. ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సీరియస్ గా ఫాలోఅప్ చేశారు. అదే సమయంలో టిడిపి కూటమి ప్రభుత్వం నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. దీంతో కేంద్రం సైతంవిశాఖ రైల్వే జోన్ శంకుస్థాపనకు ముందుకు వచ్చింది. డిసెంబర్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించి.. రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. మొత్తానికైతే గత పది ఏళ్లలో సాకారం కానీ ప్రత్యేక రైల్వే జోన్.. ఇప్పుడు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.