Imtiaz Ahmed: వైసీపీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. పార్టీ నుంచి సీనియర్లు వైదొలుగుతున్నారు. ఈ ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయం చవిచూసింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో నేతల్లో ఒక రకమైన ఆందోళన కనిపించింది. పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న చాలామంది నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన కేశినేని నాని పార్టీకి రాజీనామా చేశారు. సినీ నటుడు అలీ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చారు. అటు తరువాత వరుసగా పార్టీ నేతలు గుడ్ బై చెబుతూనే ఉన్నారు. జిల్లాలకు జిల్లాలు ఖాళీ అవుతూనే ఉన్నాయి. రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు,మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్యలు పదవులు వదులుకున్నారు. పార్టీ కి సైతం రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలు పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ, జయ మంగళం వెంకటరమణ వంటి వారు సైతం పార్టీతో పాటు పదవులకు రాజీనామా చేశారు. మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్.. ఇలా చెప్పుకుంటే చాలామంది నేతలు పార్టీని వీడారు. మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పిన వారిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా రాయలసీమకు చెందిన ఓ నేత పార్టీకి గుడ్ బై చెప్పారు.
* కర్నూలు అసెంబ్లీ స్థానానికి పోటీ
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇంతియాజ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. ఎన్నికలకు ముందు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి 18 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. సమీప ప్రత్యర్థి టీజీ భరత్ చేతిలో ఓటమి చవిచూశారు . టీజీ భరత్ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల ఫలితాలు తర్వాత ఇంతియాజ్ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జగన్ కు పంపారు. తాను ఏ పార్టీలో చేరనని.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో రాయలసీమలో వైసీపీకి షాక్ తగిలినట్లే.
* రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన
అయితే చాలామంది వైసిపి నేతలకు కూటమిలో ఛాన్స్ ఇవ్వడం లేదు. పేరు మోసిన నాయకులు, వైసిపి పై ప్రభావం చూపే నేతలను మాత్రమే కూటమిలో చేర్చుకుంటున్నారు. మిగతా వారి విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అయితే వైసీపీలో కొనసాగేందుకు చాలామంది నేతలు ఆసక్తి చూపడం లేదు. చేరితే కూటమి పార్టీల్లో చేరాలి. లేకుంటే రాజకీయాలనుంచి తప్పుకోవడమే మేలన్న నిర్ణయానికి వస్తున్నారు. అందులో భాగంగానే ఇంతియాజ్ కూడా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.