Pawan Kalyan: ఏపీలో వైసీపీ నేతల దూకుడు ఆగడం లేదు. ఇంకా వారి అధికారంలో ఉన్నట్టు భ్రమిస్తున్నారు. తమకు తిరుగులేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కడపలో ఇంకా హల్చల్ చేస్తూనే ఉన్నారు. ఏకంగా విధుల్లో ఉన్న ఓ ఎంపీడీవో పై దాడి చేశారు. విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో బాధిత ఎంపీడీవో తీవ్ర గాయాల పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు పై ఈ దాడి జరిగింది. అక్కడ ఎంపీపీగా పద్మావతమ్మ వ్యవహరిస్తున్నారు. ఆమె కుమారుడు, వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి ఎంపీడీవో వద్దకు వచ్చారు. ఎంపీపీ ఛాంబర్ తాళం అడిగారు. ఎంపీపీ లేకుండా తాళాలు ఇవ్వడం కుదరదని ఎంపీడీవో చెప్పడంతో.. తీవ్ర దుర్భాషలాడుతూ సుదర్శన్ రెడ్డి తో పాటు అనుచరులు దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కొట్టడంతో ఎంపీడీవో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
* ప్రభుత్వం సీరియస్
ఎంపీడీవో ఘటనపై కూటమి ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధ్యులపై చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. ఎంపీడీవో పై దాడి అప్రజా స్వామిక చర్య అంటూ మండిపడ్డారు. ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఎంపీడీవో పై జరిగిన దాడి గురించి అధికారులతో పవన్ చర్చించారు. దాడికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత ఎంపీడీవోకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను పవన్ ఆదేశించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు. ఎంపీడీవో పై దాడి చేసిన వారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం గౌరవం లేదని అర్థం అవుతోంది అన్నారు పవన్.
* పవన్ సీరియస్ ఆదేశాలు
ఈరోజు ఎంపీడీవో జవహర్ బాబును పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. ప్రస్తుతం ఆయన కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. బాధితుడిని కలిసి కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు పవన్ కళ్యాణ్. ఈరోజు ప్రత్యేకంగా కడప వెళ్ళనున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని తెలుస్తోంది. ఇంకోవైపు రాష్ట్రంలో ఇంకా వైసీపీ దూకుడు కొనసాగుతోందని అభిప్రాయానికి వచ్చింది కూటమి సర్కార్. ప్రస్తుతం స్థానిక సంస్థలన్నీ వారి చేతుల్లోనే ఉండడంతో.. అధికారులపై పెత్తనం కొనసాగుతోందని అభిప్రాయపడింది. అందుకే వైసిపి నేతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఎంపీడీవోను పరామర్శించనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రకటనలు చేస్తారో చూడాలి.