Andhra Pradesh: ఎన్నికలవేళ ప్రతి అంశం ఇప్పుడు రాజకీయంగా మారుతోంది. అందుకు వాలంటీర్లు కేంద్ర బిందువు అవుతున్నారు. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో వాలంటీర్లతో ఎలాంటి పనులు చేయించవద్దని ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వాలంటీర్లతో పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది. అయితే తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు వల్లే ఈ పరిస్థితి వచ్చింది అంటూ వైసిపి ఆరోపణలు చేయడం ప్రారంభించింది. ఉద్దేశపూర్వకంగానే వైసీపీ సర్కార్ పెన్షన్లను ఆలస్యం చేస్తుందని తెలుగుదేశం పార్టీ కౌంటర్ అటాక్ ఇస్తోంది.ఇప్పుడుపింఛన్ల చుట్టూ రాజకీయ ప్రయోజనం పొందాలని అటు అధికార పక్షం తో పాటు ఇటు విపక్షాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి.
వాస్తవానికి ఈనెల మూడున వాలంటీర్లతో పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్లు ఇస్తుండగా.. ఆర్బిఐ సెలవులు, ఇతరత్రా కారణాలతో ఈనెల పింఛన్ల పంపిణీ మూడో తేదీన చేపట్టనున్నట్లు ముందుగానే ప్రకటించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్న వాలంటీర్లు ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఈ క్రమంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన హైకోర్టు ఈసీకి ఆదేశాలు ఇవ్వడంతో… ఎలక్షన్ కమిషన్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది. వాలంటీర్ల సేవలకు కోత విధించింది. ముఖ్యంగా పింఛన్ల పంపిణీ నుంచి దూరం చేసింది.
అయితే అప్పటినుంచి ఇదో రాజకీయ అంశంగా మారిపోయింది. వాలంటీర్లతో పెన్షన్లు ఇప్పించవద్దని ఈసీ ఆదేశించడంతో వైసిపి కొత్త ప్రచారం మొదలు పెట్టింది. టిడిపి ఫిర్యాదులతోనే పెన్షన్లు ఆగిపోయాయని ప్రచారం చేస్తోంది. టిడిపికి అనుకూలంగా పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలోని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ కోర్టులో పిటీషన్ వేసిందని.. దీని వెనుక చంద్రబాబు ఉన్నారని బలంగా ప్రచారం చేస్తోంది.దీనిపై టిడిపి బలమైన రియాక్షన్ ఇస్తోంది.సంక్షేమ పథకాల పంపిణీలో వాలంటీర్లను వాడొద్దని సీఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని.. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని… మొండిగా వాలంటీర్లతో ఇచ్చే ప్రయత్నం చేసిందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈసారి ఆలస్యంగా పింఛన్లు ఇచ్చి.. ఆ నెపాన్ని టిడిపి పై పెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. నిజంగా లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వాలనుకుంటే సచివాలయ సిబ్బందితో ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. అటు సోషల్ మీడియాలో సైతం వైసీపీ, టిడిపి శ్రేణుల మధ్య పెద్ద రచ్చ నడుస్తోంది. ఒకరికొకరు నిలదీతలు, ప్రశ్నలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అటు బయట ఇరు పార్టీల నేతలు ఈ విషయంలో ఆరోపణలు చేసుకుంటున్నారు.