Lok Sabha Elections 2024: ఆ నాలుగు స్థానాలపై కాంగ్రెస్‌ కసరత్తు.. తేలుస్తారా.. నానుస్తారా?

తెలంగాణలో నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అదే జోష్‌ను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

Written By: Raj Shekar, Updated On : April 1, 2024 12:47 pm

Congress is working on those four seats

Follow us on

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై పది రోజులు దాటింది. అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటనలో బిజీగా ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ ఇప్పటికే 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలు పెట్టింది. బీఆర్‌ఎస్‌ కూడా 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అధికార కాంగ్రెస్‌ 13 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించి వెనుకబడింది. ఏప్రిల్‌ 13న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మిగతా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ కసరత్తు మొదలు పెట్టింది. మరోవైపు వలసలను ప్రోత్సహిస్తోంది. చేరికలు జోరుగా సాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ నుంచి చాలా మంది అధికార కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు. సీనియర్లు కూడా బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు.

రెండంకెల సీట్లపై దృష్టి..
తెలంగాణలో నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అదే జోష్‌ను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ మేరకు అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 9 స్థానాల్లో గెలవగా బీజేపీ 4, కాంగ్రెస్‌ 3, ఎంఐఎం ఒక స్థానం గెలిచాయి. ఈసారి కాంగ్రెస్‌ రెండంకెల సీట్లపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.

నాలుగు స్థానాలకు పోటీ..
ఇక మిగతా నాలుగు స్థానాలు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈమేరకు ఢిల్లీలో ఏఐసీసీ ఎన్నికల కమిటీ ఏప్రిల్‌ 1న సమావేశమైంది. నాలుగు స్థానాలపై సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. ఖమ్మం సీటుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు, సీనియర్‌ నేత వీహెచ్, మరో ఇద్దరు టికెట్‌ ఆశిస్తున్నారు. ఇక వరంగల్‌ టికెట్‌ రేసులోనూ ఐదుగురు ఉన్నారు. సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్, కడియం కావ్య, సీనియర నాయకుడు అద్దంకి దయాకర్, మరో ఇద్దరు టికెట్‌ ఆశిస్తున్నారు. కరీంనగర్‌లో మాత్రం ఈక్వేషన్స్‌ కుదరక ఎంపికలో జాప్యం జరుగుతోంది. ఇక్కడ ముగ్గురు టికెట్‌ రేసులో ఉన్నారు. అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, రాజేందర్‌రావు, తీన్మార్‌ మల్లన్న పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక హైదరాబాద్‌ టికెట్‌ రేసులో టెన్నిస్‌ స్టార్‌ సానియామీర్జ, మరో మహిళానేత టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ నాలుగు స్థానాల అభ్యర్థులను సోమవారం సాయంత్రం ఖరారు చేసే అవకాశం ఉంది.

ఎన్నికల కమిటీ భేటీ..
తెలంగాణలో నాలుగు స్థానాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఖరారుకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తోపాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ టీపీసీసీ చీఫ్‌ షర్మిల తదితరులు పాల్గొన్నారు.