AP Ration Rice: రేషన్ బియ్యానికి బదులు నగదు అందిస్తే ఎలా ఉంటుందోనని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. నిరుపేదలకు ఆదుకోవాలని లక్ష్యంతో తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో కిలో బియ్యం పై 40 రూపాయల వరకు భారం పడుతుంది. ప్రభుత్వమే ఈ రాయితీని భరిస్తోంది. అయితే ఈ రేషన్ బియ్యం పెద్ద ఎత్తున పక్క దారి పడుతుంది. రేషన్ విడిపిస్తున్న లబ్ధిదారులు ఈ బియ్యాన్ని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అదే బియ్యం విదేశాలకు తరలిపోతోంది. అదే సమయంలో మిల్లులో మర పట్టి క్వాలిటీ బియ్యం లో కలిపి విక్రయాలు చేస్తున్నారు. పెద్ద దందాకు తెర తీస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు పెద్ద ఎత్తున బియ్యం తరలిపోతున్న విషయం బయటపడింది. గతం నుంచి ఆరోపణలు ఉన్నా.. సాక్షాత్ ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కలుగజేసుకొని ఆ బియ్యాన్ని పట్టుకున్నారు. దీంతో ఇది సంచలనంగా మారింది. అందుకే పేదలకు బియ్యం బదులు నగదు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే సంచలనమే.
* నిత్యావసరాల పంపిణీ
పేదలు మూడు పూటలా అన్నం తినేందుకుగాను తెలుగుదేశం ప్రభుత్వం తొలిసారిగా రేషన్ పంపిణీ మరింత సరళతరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చౌక ధరల దుకాణాలను ఏర్పాటు చేసింది. నాడు టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఈ విషయంలో చొరవ చూపారు. చౌక ధరల డిపోల ద్వారా ఇంటికి అవసరమైన నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అయితే కాలక్రమేనా ఈ చౌక ధరల డిపోలు బియ్యం పంపిణీకి పరిమితం అయ్యాయి. అయితే ఇలా పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతోంది. రేషన్ లబ్ధిదారుడి కంటే వ్యాపారులకు, దళారులకు లబ్ధి చేకూర్చుతోంది. అందుకే బియ్యం బదులు నగదు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
* కొద్దిరోజుల్లో క్లారిటీ
బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం ధర 50 రూపాయల పై మాటే. అయితే చౌక ధరల డిపో ద్వారా అందిస్తున్న బియ్యం కిలో రెండు రూపాయలు మాత్రమే. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం పేదలకు ఉచితంగా బియ్యం అందిస్తోంది. అయితే ఈ బియ్యాన్ని గ్రామాల్లో దళారులు, వ్యాపారులు 17 రూపాయల నుంచి 20 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. వాటిని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కొంత బియ్యం మిల్లులో మరోసారి మర పట్టి క్వాలిటీ బియ్యం లో కలిపేస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు వస్తోంది. అక్కడ నుంచి నౌకల్లో విదేశాలకు తరలిపోతోంది. ఈ తరుణంలోనే రేషన్ బియ్యం పక్కదారిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే రేషన్ పంపిణీలో బియ్యం బదులు నగదు అందించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై కొద్ది రోజుల్లో క్లారిటీ రానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.