ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు అసలు సినిమా అర్థమైంది.. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఒత్తిడితో తలవంచింది. హైబ్రిడ్ విధానంలో (భారత్ తలపడే మ్యాచ్ లు) నిర్వహించేందుకు ముందుకు వచ్చింది.. ఐసీసీ బోర్డు సమావేశంలో పాకిస్తాన్ తన నిర్ణయం వెల్లడించింది. కాకపోతే భవిష్యత్తు కాలంలో భారత్ ఆతిథ్యం ఇచ్చే ఐసిసి టోర్నీలలో ఇదే విధానాన్ని పాటించాలని పాకిస్తాన్ కోరినట్టు తెలుస్తోంది.. ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో పాకిస్తాన్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా చెప్పాల్సి ఉంది. ఆదివారం ఐసిసి చీఫ్ గా జై షా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టే ఒకరోజు ముందు ఛాంపియన్స్ ట్రోఫీ వివాదం పరిష్కారానికి గురైంది.
పాకిస్తాన్ ఆతిథ్యం
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో జరగాల్సి ఉంది. ఉండే ఫార్మాట్లో ఈ టోర్నీ జరుగుతుంది. పాకిస్తాన్ తో నెలకొన్న వివాదాలు, భద్రతాపరమైన కారణాల నేపథ్యంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడేందుకు నిరాకరించింది. పాక్ వేదికగా కాకుండా హైబ్రిడ్ విధానంలో ఆడేందుకు సమ్మతం తెలిపింది. ఇదే విషయాన్ని ఐసిసి దృష్టికి కూడా తీసుకెళ్లింది. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్వహించకూడదని భారత క్రికెట్ నియంత్రణ మండలి తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. దీనిపై ఐసీసీ మందలించడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.. ఇక భారత్ హైబ్రిడ్ విధానంలో ఆడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తామని పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాలకు వెళ్ళింది. కానీ అసలు సినిమా అర్థం కావడంతో వెనక్కి తగ్గింది. ఇలానే వ్యవహరిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ నిర్వహణ వేరే జట్టుకు ఇవ్వాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించడంతో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెనక్కి వెళ్ళింది. మొత్తంగా హైబ్రిడ్ విధానానికి ఓకే చెప్పేసింది. అయితే భవిష్యత్ కాలంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ మ్యాచ్ లు కూడా హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని పాకిస్తాన్ కోరింది. దానికి ఐసీసీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఇదే విషయాన్ని ఐసీసీ ఆదివారం లేదా సోమవారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ తమ దేశంలోని క్రికెట్ మైదానాలను ఆధునికీకరిస్తోంది. భారీగా డబ్బులు ఖర్చు పెట్టింది. ఒకవేళ ఐసీసీ చెప్పినట్టు వినకపోతే మొదటికే మోసం వస్తుందని భావించి.. పాకిస్తాన్ హైబ్రిడ్ మోడ్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియా కూడా ఇదే విషయాన్ని ఉటంకిస్తోంది.