CM YS Jagan : ఏపీలో ఏసీబీ జూలు విదిల్చింది. రెవెన్యూ అవినీతిని ఏరివేసే పనిలో పడింది. అటు సబ్ రిజిస్ట్రార్, సబ్ ట్రెజరీ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేసింది. ఏసీబీ ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్, డయాల్ ‘ఏసీబీ 14400’కి వచ్చిన ఫిర్యాదులపై అవినీతి నిరోధక శాఖ స్పందించింది. గురువారం ఉదయం నుంచి కార్యాలయానలు తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. ఉద్యోగుల కంటే ముందుగానే ఏసీబీ అధికారులు కార్యాలయాలకు చేరుకున్నారు. క్షుణ్ణంగా పరిశీలనలు జరిపారు. కొందరు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అధికార, ఉద్యోగ వర్గాల్లోదడ ప్రారంభమైంది. కొందరైతే కార్యాలయాలకు రావడానికి భయపడుతున్నారు. రకరకాల కారణాలు చెప్పి సెలవు పెడుతున్నారు.
ఏకకాలంలో..
రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏసీబీ ఏక కాలంలో దాడులు చేస్తోంది. డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు దాడులు చేస్తున్నట్టు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ ఏసీబీ 14400 కాల్ సెంటర్, ఏసిబి యాప్ కి వచ్చిన ఫిర్యాదులపై మాత్రమే సోదాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కడప జిల్లా బద్వేలు, తిరుపతి రూరల్, అనంతపురం రూరల్, విశాఖలోని జగదాంబ, కాకినాడ జిల్లా తుని. ఏలూరు జిల్లా నర్సాపురం, నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలపై ఏసీబీ అధికారులు గురిపెట్టారు. గుంటూరు జిల్లా మేడికొండ, శ్రీకాకుళం జిల్లా జలుమూరు తహసీల్దారు కార్యాలయాల్లో సైతం సోదాలు కొనసాగుతున్నాయి. కొన్నిరకాల అవకతవకలు గుర్తించినట్టు తెలుస్తోంది. కొందరు అధికారులను సైతం అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఏడాది కిందట ఏర్పాటు..
గత ఏడాది జూన్ 2న అవినీతి నిరోధక శాఖను బలోపేతం చేస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఏసీబీ 14400 కాల్ సెంటర్ ఏర్పాటుతో పాటు ఏసీబీ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఏడాది గడుస్తున్నా ఏసీబీ యాక్షన్ లేకపోయేసరికి సర్వత్రా విమర్శలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ యాక్సన్ ప్లాన్ లోకి దిగింది. ఏకకాలంలో కార్యాలయాలపై దాడిచేసింది. ఏసీబీ తాజా చర్యలపై అభినందనలు వెల్లవెత్తుతున్నాయి. దీంతో అటు మొబైల్ యాప్ పై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. 14400 కాల్ సెంటర్ కు సైతం ఫిర్యాదులు పెరుగుతున్నాయి.
ఇలా చేయాలి..
ఇప్పుడు ఎక్కువ మంది ఫిర్యాదు కోసం మొబైల్ యాప్ కోసం ఆరాతీస్తున్నారు. అటువంటి వారు. గూగుల్ ప్లే స్టోర్‌లో ‘ఏసీబీ 14400’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయడం ద్వారా వినియోగానికి సిద్ధంగా ఉంటుంది. అవినీతి వ్యవహారాలకు సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను నేరుగా లైవ్ రిపోర్ట్ ఫీచర్ వినియోగించుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. లాడ్జ్ కంప్‌లైంట్ ఫీచర్ ద్వారా తమ దగ్గరున్న డాక్యుమెంట్లు, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించవచ్చు. ఫిర్యాదు రిజిస్టర్ చేయగానే మొబైల్ ఫోన్‌కు రిఫరెన్స్ నంబరు వస్తుంది.