Amrabad Forest: కూనోలో చీతాలు కన్ను మూస్తుంటే.. అమ్రాబాద్ అడవుల్లో అరుదైన జంతువు ప్రత్యక్షం

అడవి శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నల్లమల అడవుల్లో మొదటిసారిగా ఇది సంచరిస్తున్నదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కర్ణాటకలోని అడవి మార్గం ద్వారా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి ఇది ప్రవేశించిందని ఫారెస్ట్ డివిజన్ అధికారి రోహిత్ చెబుతున్నారు.

Written By: Bhaskar, Updated On : April 27, 2023 1:42 pm
Follow us on

Amrabad Forest: మధ్యప్రదేశ్ లోని కూనో జాతీయ పార్కు లో ఆఫ్రికా నుంచి తెచ్చిన చీతాల్లో రెండు కన్నుమూశాయి. మిగతా వాటిని కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వాటిని ఎందుకు తీసుకొచ్చారు అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే క్రమంలో మన రాష్ట్రంలోని అమ్రాబాద్ ఫారెస్ట్ లో అరుదైన జంతువు ప్రత్యక్షమైంది.. ఇది అలాంటి ఇలాంటి జంతువు కాదు.. బాహుబలి సినిమాలో బల్లాలదేవ పోట్లాడే దున్నకు రెండింతలు పెద్దగా ఉంటుంది. దాని పేరే బైసన్.. బైసన్ అంటే ఇంగ్లీషులో భారీ దున్నపోతు అని అర్థం. అచ్చంపేట కోర్ ఫారెస్ట్ లో సంచరిస్తోంది. అయితే ఇది కర్ణాటక అడవుల నుంచి వచ్చిందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు.

సీసీ కెమెరాల్లో గుర్తింపు

భారీ బైసన్ ను అటవీ శాఖ అధికారులు అచ్చంపేట కోర్ ఫారెస్ట్ లో కనుగొన్నారు. ఇది 300 కిలోలకు పైగా బరువు ఉంటుందని అడవి శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నల్లమల అడవుల్లో మొదటిసారిగా ఇది సంచరిస్తున్నదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కర్ణాటకలోని అడవి మార్గం ద్వారా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి ఇది ప్రవేశించిందని ఫారెస్ట్ డివిజన్ అధికారి రోహిత్ చెబుతున్నారు. బౌరాపూర్ సమీపంలో బైసన్ మొదటిసారిగా కనిపించింది. అంతకుముందు ఇది నారాయణపేట రిజర్వ్ ఫారెస్ట్ లో కనిపించింది.

సంతోషకరం

మైదాన ప్రాంత జంతువైన బైసన్ అమ్రాబాద్ అడవులకు రావడం సంతోషమని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కెమెరా ట్రాప్ ఇమేజ్ లతో అధికారులు దానిని కదలికలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అది మేత మేసుకుంటూ అచ్చంపేట పట్టణం నుంచి ఫారెస్ట్ కోర్ ఏరియా కు చేరుకుంది. అంతకుముందు డిండి రిజర్వాయర్ సమీపంలోని వ్యవసాయ భూములు, గ్రామాలను దాటింది. ఆపై ఉత్తర వైపు తిరుగుతూ ముందుకు సాగుతోంది. ఒకవేళ బైసన్ కనుక స్థిరపడితే పులి మినహా ఇతర జంతువులతో దానికి పెద్దగా ఇబ్బందులు ఉండవని అటవీశాఖ అధికారులు అంటున్నారు.

పులికి ఇష్టం

బైసన్ పులికి ఇష్టమైన జంతువు. అది బలిష్టంగా ఉండడంతో దానిని వేటాడేందుకు పులి మక్కువ చూపిస్తుంది. పైగా దాని మాంసం రుచిగా ఉండడంతో ఇష్టంగా లాగిస్తుంది.. గతంలో అమ్రాబాద్ ఫారెస్ట్ లో బైసన్ లు మనుగడ సాగించినట్టు ఆధారాలు లేవు. అయితే కర్ణాటక నుంచి ఈ బైసన్ రావడంతో.. దానిని అనుసరించి మిగతావి కూడా వస్తాయని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆమ్రాబాద్ ఫారెస్ట్ పులుల సంరక్షణ కేంద్రంగా ఉంది. ఇక్కడ జింకలు కూడా రెట్టించిన స్థాయిలో జింకలు ఉండడంతో పులులకు కడుపునిండా ఆహారం దొరుకుతున్నది. అంతేకాదు ఆమ్రాబాద్ ఫారెస్ట్ లో జీవవైవైద్యం మెండుగా ఉండడంతో జంతువులు కూడా స్వేచ్ఛగా మనుగడ సాగించగలుగుతున్నాయి. పైగా ఇక్కడి మనోహరమైన దృశ్యాలు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం వేసవికాలం కావడంతో ప్రభుత్వం టైగర్ సఫారీకి అనుమతి ఇచ్చింది. దీంతో పర్యాటకులతో ఆమ్రాబాద్ ఫారెస్ట్ కళకళలాడుతోంది.