CM Chandrababu: దేశంలో జెడ్ ప్లస్ క్యాటగిరి భద్రతలో ఉన్న నేతలు చాలామంది ఉన్నారు. అందులో ఏపీ సీఎం చంద్రబాబు ఒకరు. 2003లో సీఎం గా ఉన్న చంద్రబాబును టార్గెట్ చేస్తూ నక్సలైట్లు దాడి చేశారు. తిరుపతి వెళుతున్న చంద్రబాబును అలిపిరి వద్ద క్లైమేరామెన్స్ పెట్టి పేల్చివేశారు. చంద్రబాబు కాన్వాయ్ తునాతునకలైంది. అదృష్టవశాత్తు చంద్రబాబు బతికారు. అప్పటినుంచి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఆయనకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత అందిస్తోంది. ఆయన విపక్షంలో ఉన్న ఆ భద్రత కొనసాగుతూ వస్తోంది. అయితే ఈసారి సీఎం అయిన చంద్రబాబు భద్రత భారీగా తగ్గింది. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కొనసాగుతున్నా ఆయనకు భద్రత నిచ్చే సిబ్బంది తగ్గుముఖం పట్టడం విశేషం. అయితే చంద్రబాబు తనంతట తానుగా భద్రత తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. దుబారా ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగానే భద్రతను తగ్గించినట్లు సమాచారం.
* జగన్ కంటే తగ్గిన భద్రత
గత ఐదేళ్లుగా ఈ రాష్ట్రానికి సీఎంగా జగన్ వ్యవహరించారు. అప్పట్లో ఆయనకు వేలాదిమంది భద్రత ఉండేది. కానీ ఇటీవల అధికారంలోకి వచ్చిన చంద్రబాబు భద్రత గణనీయంగా తగ్గింది. కేవలం 121 మంది మాత్రమే ఆయనకు భద్రత కల్పిస్తున్నారు. ఇది జగన్ తో పోల్చుకుంటే ఎనిమిది రెట్లు తక్కువ. అప్పట్లో జగన్ భద్రతా కాన్వాయ్ లో 17 వాహనాలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 11 కు తగ్గింది. కేవలం ఖర్చు తక్కువ చేసుకోవాలన్న కోణంతోనే ఇలా భద్రతతో పాటు కాన్వాయ్ ని తగ్గించినట్లు సమాచారం. అటు మంత్రి లోకేష్ సైతం తన భద్రతను తగ్గించుకున్నారు.
* డ్రోన్ల సహకారం
అయితే చంద్రబాబు తన భద్రతను తగ్గించడం వెనుక డ్రోన్లు ఉన్నాయి. ఏపీలో డ్రోన్ల రంగానికి సీఎం చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోనే ఏపీని డ్రోన్ల హబ్ గా మార్చాలని ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగా తన భద్రతకు కూడా డ్రోన్ల సేవలను వినియోగించుకోవాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలోనే డ్రోన్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. సీఎం చంద్రబాబు కు సంబంధించి కార్యక్రమాలను ముందుగానే పర్యవేక్షిస్తున్నాయి డ్రోన్లు. అక్కడ పరిస్థితిని భద్రతా సిబ్బందికి ఎప్పటికప్పుడు తెలియజేసి అప్రమత్తం చేస్తున్నాయి. అందుకే భద్రతా సిబ్బందికి ఎటువంటి పని లేకుండా పోయింది. వారి సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు సమాచారం.