CM Chandrababu: వైసీపీ విషయంలో చంద్రబాబు స్కెచ్ ఏంటి? పూర్తిగా నిర్వీర్యం చేస్తారా? లేకుంటే అవసరం మేరకు మాత్రమే చేరికలను ప్రోత్సహిస్తారా? అసలు ఆయన మదిలో ఏముంది? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించింది. 175 స్థానాలకు గాను 164 చోట్ల విజయం సొంతం చేసుకుంది. వైసీపీని కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేసింది. ఆ పార్టీకి చెందిన పెద్దపెద్ద నాయకులు సైతం ఓడిపోయారు. తాజా మాజీ మంత్రుల్లో ఒక్కరు మాత్రమే గెలిచారు. గెలిచిన 11 సీట్లలో ముగ్గురు మాత్రమే ఎంతో కొంత పవర్ ఫుల్. మిగతావారు పెద్ద లెక్క కూడా కాదు. అయితే ఇప్పుడు వైసీపీని క్లోజ్ చేయాలని ప్రత్యర్థులు భావిస్తారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు వేరే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. కేవలం అవసరం మేరకు మాత్రమే వైసిపి నేతలను పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారు. అవసరం లేనివారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోకూడదని భావిస్తున్నారు. ముఖ్యంగా రాజ్యసభ, ఎమ్మెల్సీలను మాత్రమే పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
* అక్కడ కనీస ప్రాతినిధ్యం లేదు
రాజ్యసభలో టిడిపికి కనీస ప్రాతినిధ్యం లేదు. 2019 ఎన్నికల్లో టిడిపి కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అందుకే గత ఐదేళ్లుగా రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు టిడిపికి చిక్కలేదు. ఆ రెండు పెద్ద సభల్లో టిడిపి ప్రాతినిధ్యం తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా రాజ్యసభ సీట్లు తగ్గుముఖం పట్టడం ఆ పార్టీకి లోటే. పార్టీ ఆవిర్భావం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. చివరిగా ఉన్న సభ్యుడు కనకమెడల రవీంద్ర కుమార్ కూడా ఎన్నికలకు ముందు పదవీ విరమణ చేశారు.
* శాసనమండలిలో పర్వాలేకున్నా..
2019 ఎన్నికల్లో ఓడిపోయినా.. శాసనమండలిలో మాత్రం టిడిపికి ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉండేవారు. అయితే ఒక్కొక్కరు పదవీ విరమణ చేస్తుండడంతో ఖాళీ అవుతూ వచ్చింది. అయితే పట్టభద్రులతో పాటు ఎమ్మెల్యేల కోటా కింద గత ఏడాది నలుగురు ఎమ్మెల్సీలు టిడిపి తరఫున గెలిచారు. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ పట్టభద్రుల స్థానం నుంచి టిడిపి అభ్యర్థులే ఘనవిజయం సాధించారు. మరోవైపు ఎమ్మెల్యేల కోట కింద అనూహ్యంగా పంచుమర్తి అనురాధ సైతం గెలిచారు. ప్రస్తుతం శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి 8 మంది వరకు ఎమ్మెల్సీలు ఉన్నారు. అదే వైసీపీకి 38 మంది వరకు ఉన్నారు. అందుకే వీలైనంతవరకు ఎమ్మెల్సీలను తమ వైపు లాక్కోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయిస్తున్నారు.
* ఓడిన నేతలకు చాన్స్ లేదు
రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు. నిన్న మోపిదేవి వెంకటరమణ తో పాటు బీదా మస్తాన్ రావు రాజీనామా చేశారు. మరికొందరు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి వైసీపీని వీడారు. కేవలం పార్టీకే కాకుండా పదవులకు రాజీనామా చేశారు.అయితే శాసనమండలి, రాజ్యసభల్లో ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే చంద్రబాబు వారిని చేర్చుకుంటున్నారని తెలుస్తోంది. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన చాలామంది నేతలు వైసిపికి గుడ్ బై చెప్పారు. వారి విషయంలో మాత్రం చంద్రబాబు ఎటువంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యసభ, శాసనమండలిలో ప్రాతినిధ్యం పెంచుకోవడం అవసరం కాబట్టి వారితో రాజీనామా చేయిస్తున్నారు. పార్టీలో చేర్చుకుంటున్నారు. వారికి అదే పదవులు ఇవ్వడమో.. లేకుంటే నామినేటెడ్ పదవులు సర్దుబాటు చేయడమో చేయనున్నారు.