Byreddy Siddharth Reddy: పాపం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. ఎలా ఉండేవారు ఎలా అయ్యారు.. మెడకు హత్య కేసు

వైసీపీలో విపరీతమైన క్రేజ్ ఉన్న నేతల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒకరు. సోషల్ మీడియాలో పెద్ద హైప్ క్రియేట్ చేసుకున్నారు. గత ఐదేళ్ల కాలంలో ఒక వెలుగు వెలిగారు. కానీ వైసీపీ ఓడిపోవడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

Written By: Dharma, Updated On : August 31, 2024 4:47 pm

Byreddy Siddharth Reddy

Follow us on

Byreddy Siddharth Reddy: వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. హత్య కేసులో ఆయనకు ఇబ్బందులు తప్పవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడితో సిద్ధార్థ రెడ్డి ఫోన్లో మాట్లాడిన వాయిస్ కాల్ ఒకటి బయటకు వచ్చింది. అదే కేసులో సిద్ధార్థ రెడ్డి అనుమానితుడు కూడా. అయితే ప్రధాన నిందితుడితో సిద్ధార్థ రెడ్డి మాట్లాడిన వాయిస్ కాల్స్ కు సంబంధించిన సంభాషణలు హత్యకు గురైన వ్యక్తి కుమార్తెకు దొరకడం విశేషం. ఇప్పటికే ఈ హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఎలాగైనా శిక్ష పడాలని మృతుడి కుమార్తె భావిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆమెకు కీలక సాక్షాలు చిక్కడం విశేషం. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ తెలుగు సాయి ఈశ్వరుడు 2014లో దారుణంగా హత్యకు గురయ్యారు. దీనిపై కర్నూలు సిటీ మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ప్రధాన నిందితుడు చికెన్ భాషా కాగా.. వైసీపీ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరుల మీద కేసులు నమోదు అయ్యాయి. విజయవాడ కోర్టులో కేసు విచారణ జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్న చికెన్ బాషా తో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఆ వాయిస్ కాల్ రికార్డ్ మృతుడు కుమార్తె జ్యోతికి దొరికాయి. దీంతో ఈ వాయిస్ కాల్ రికార్డింగ్ సాక్ష్యాలుగా పరిగణించాలని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ ను విజయవాడ కోర్టు తిరస్కరించింది. విజయవాడ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ జ్యోతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా విచారించిన హైకోర్టు విచారణను సెప్టెంబర్ ఐదో తేదీకి వాయిదా వేసింది. దీంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇబ్బందులు తప్పవని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* వైసిపి ఓటమితో
వైసిపి ఓడిపోవడంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఐదేళ్ల వైసిపి హయాంలో సిద్ధార్థ రెడ్డి దూకుడుగా వ్యవహరించారు. నందికొట్కూరు షాడో ఎమ్మెల్యేగా పనులు చక్కబెట్టారు. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండేవారు. దీంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి సైతం శాప్ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చారు. క్రీడల శాఖ మంత్రిగా ఉండే రోజాతో పాటు సిద్ధార్థ రెడ్డి హల్చల్ చేసేవారు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ లపై విరుచుకుపడేవారు.వైసీపీ ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారు.

* టిడిపిలోకి బాబాయి జంప్
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్వయానా బాబాయ్ రాజశేఖర్ రెడ్డి. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన. రాజశేఖర్ రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి కి నంద్యాల టికెట్ ఇచ్చారు చంద్రబాబు. మంచి మెజారిటీతో ఎంపీగా ఆమె విజయం సాధించారు. పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అయితే ఆది నుంచి నందికొట్కూరు నియోజకవర్గంపై దృష్టి పెట్టారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.అది ఎస్సీ నియోజకవర్గం కావడంతో.. అక్కడ పోటీ చేసేందుకు వీలు లేకపోయింది. అయినా సరే తనకు నచ్చిన ఎస్సీ అభ్యర్థిని నిలబెడుతూ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించేవారు. కానీ ఈసారి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సూచించిన నేతకు కాకుండా.. పక్క జిల్లా నాయకుడికి అవకాశం ఇచ్చారు జగన్. అయినా ఆయన ఓడిపోయారు.

* నందికొట్కూరు మున్సిపాలిటీ ఖాళీ
రాజకీయంగా కూడా వరుసగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి షాక్ లు తగులుతున్నాయి. నందికొట్కూరు మున్సిపాలిటీ ఇప్పటికే చేజారింది. అక్కడ మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లంతా టిడిపిలో చేరారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పాత కేసు వెలుగులోకి వచ్చింది. పట్టు బిగించినట్లు కనిపిస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా బాబాయ్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విభేదించారు సిద్ధార్థ రెడ్డి. ఇప్పుడు ఆయన ఏకంగా అధికార పార్టీలో ఉన్నారు. ఆయన కుమార్తె ఎంపీగా గెలిచారు. దీంతో ఇంటా బయటా.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇబ్బందులు తప్పడం లేదు.