Free Gas: గ్యాస్ ఆన్ చేసి.. స్వయంగా లైటర్ కొట్టి.. పాలు పెట్టి టీకాచీ.. చంద్రబాబు వీడియో వైరల్

ప్రతిష్టాత్మక పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఉచిత గ్యాస్ పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారు. స్వయంగా టీకాచి తాగడం విశేషం.

Written By: Dharma, Updated On : November 1, 2024 4:31 pm

Free Gas(1)

Follow us on

Free Gas: ఏపీలో ఉచిత గ్యాస్ పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురంలో పథకాన్ని ప్రారంభించారు. అధికారంలోకి వస్తే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ పథకాలలో సైతం దీనికి చోటు కల్పించారు. కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటుతున్న క్రమంలో.. ఒక్కో పథకం అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు దీపం పథకానికి శ్రీకారం చుట్టారు. లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడారు. ఏటా రెండు వేల 684 కోట్లతో పథకాన్ని ఐదేళ్లపాటు కొనసాగిస్తామని చంద్రబాబు తెలిపారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి విశాఖ చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి హెలిక్యాప్టర్లో ఈదుపురం చేరుకున్నారు. గ్రామంలో పర్యటించి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. శాంతమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి గ్యాస్ సిలిండర్ పంపిణీ చేశారు. అనంతరం స్వయంగా గ్యాస్ వెలిగించి టీ పెట్టారు చంద్రబాబు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. కొద్దిసేపు వారితో ముచ్చటించారు. స్వయంగా సీఎం తమ ఇంటికి రావడంతో శాంతమ్మ దంపతులు చాలా ఆనందపడ్డారు.అనంతరం ఓ పింఛన్ లబ్ధిదారు రాలి ఇంటికి వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందజేశారు.

* గతానికి భిన్నంగా
అయితే శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ముందుకు సాగింది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో చాలాసార్లు సీఎం హోదాలో జగన్ వచ్చారు. అప్పట్లో భారీ జన సమీకరణ చేసేవారు. దాదాపు ఇతర జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి జనాలను తరలించేవారు. కానీ ఈరోజు చంద్రబాబు పర్యటన అందుకు విరుద్ధంగా ఉంది. కేవలం కార్యక్రమానికి ఆ గ్రామాన్ని పరిమితం చేశారు. పథకాన్ని ప్రారంభించిన తర్వాత చంద్రబాబు గ్రామస్తులతో మమేకమయ్యారు.

* తొలిసారిగా జిల్లాకు..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు జిల్లాకు వచ్చారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆనందం వెల్లివిరిసింది. హెలిక్యాప్టర్లో విశాఖ నుంచి వచ్చిన చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కింజరాపు అచ్చెనాయుడు, కొండపల్లి శ్రీనివాసరావు తో పాటు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఈరోజు సాయంత్రం శ్రీకాకుళం నగరంలో అధికారులతో సమీక్ష జరపనున్నారు చంద్రబాబు. రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.