https://oktelugu.com/

Harirama Jogaiah: ఆ వృద్ధ నేత లేఖ.. ఇరకాటంలో పవన్!

కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటుతోంది. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు కాపు సంక్షేమ సంఘం నేత.

Written By:
  • Dharma
  • , Updated On : November 1, 2024 / 04:41 PM IST

    Harirama Jogaiah

    Follow us on

    Harirama Jogaiah: కాపు నేత, వృద్ధ నాయకుడు హరి రామ జోగయ్య మరోసారి తెరపైకి వచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ లేఖలు రాయడంలో ప్రసిద్ధుడు ఆయన. గతంలో వైసిపి ప్రభుత్వానికి వరుసగా లేఖలు రాసేవారు. పవన్ కళ్యాణ్ కు సైతం లేఖలతో ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి మరో లేఖ రాశారు. ప్రధానంగా గోదావరి జిల్లాల అభివృద్ధిని ప్రస్తావించారు. వైసిపి ప్రభుత్వం మాదిరిగానే కూటమి ప్రభుత్వం గోదావరి జిల్లాల విషయంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. వెంటనే అభివృద్ధికి అవసరమైన చర్యలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూటిగా ప్రశ్నల వర్షం కురిపించారు. గోదావరి జిల్లాల అభివృద్ధి పట్టదా? అని ప్రశ్నించారు. ప్రధానంగా నరసాపురం కోటిపల్లి రైల్వే లైన్, కోనసీమలో పెట్రోలియం అనుసంధాన పరిశ్రమలు, వివిధ రహదారులపై వంతెన నిర్మాణాలు, రాజమండ్రి ఎయిర్పోర్ట్ అభివృద్ధి వంటి అంశాలను ప్రస్తావించారు. వీటిపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఎన్డీఏ ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హరి రామ జోగయ్య.

    * వయోభారంతో బాధపడుతూ
    రాజకీయాల్లో సుదీర్ఘకాలం వివిధ పదవులు అనుభవించారు హరి రామ జోగయ్య. 8 పదుల వయసులో వయోభారంతో బాధపడుతున్నారు. ఈ ఎన్నికలకు ముందు కాపు సంక్షేమ సేవా సమితిని ఏర్పాటు చేశారు. జనసేనకు అండగా నిలిచేవారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి ముద్రగడ తప్పుకోవడంతో ఆ బాధ్యతను తన మీద వేసుకున్నారు. ఓసారి వైసీపీ హయాంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అయితే ఆయన ఆరోగ్యం విషమంగా మారడంతో జనసేన అధినేత పవన్ స్పందించారు. నేరుగా హరి రామ జోగయ్య వద్దకు వెళ్లి దీక్షను విరమింప చేశారు. జనసేనలో హరి రామ జోగయ్య యాక్టివ్ పాత్ర పోషిస్తారని అప్పట్లో టాక్ నడిచింది. అయితే ఎన్నికల ముంగిట లేఖలతో పవన్ కళ్యాణ్ ను ఇరుకున పెట్టారు. దీంతో హరి రామ జోగయ్య విషయంలో పవన్ ఆలోచన మారింది. పవన్ పట్టించుకోకపోవడంతో హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలోకి వెళ్లారు. సీటు దక్కినా.. ఓటమి తప్పలేదు. అయితే ఎన్నికల తరువాత కూడా ప్రభుత్వాలకు లేఖలు రాస్తూ వచ్చారు హరి రామ జోగయ్య.

    * దత్తత మాటేంటి పవన్
    గత ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలను దత్తత తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు, హరి రామ జోగయ్య. ఉభయగోదావరి జిల్లాల అభివృద్ధికి తక్షణం చొరవ చూపాలని పవన్ ను డిమాండ్ చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో జాతీయ రహదారులను విస్తరించాలని కూడా విజ్ఞప్తి చేశారు. పర్యాటకంగానూ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు రాజకీయ అంశాలతో లేఖలు రాసిన హరి రామ జోగయ్య ఇప్పుడు రూటు మార్చారు. గోదావరి జిల్లాల అభివృద్ధిపై పడ్డారు. దీనిపై మున్ముందు మరిన్ని లేఖలు రాసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.