Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి( megastar Chiranjeevi) తనను తాను తగ్గించుకుంటున్నారని నెటిజెన్లు మండిపడుతున్నారు. రెండు రోజుల కిందట విజయవాడలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభకు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు మెగాస్టార్ చిరంజీవి. అయితే గతంలో ఇదే చిరంజీవి చంద్రబాబుపై చాలా రకాల విమర్శలు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేశారు. ఆ సందర్భంలో చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. తాజాగా చంద్రబాబును చిరంజీవి వ్యాఖ్యలు చేయడంతో.. సోషల్ మీడియాలో చిరంజీవి చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు ట్రోల్ చేస్తున్నారు.
Also Read: వైసిపి మాజీ ఎంపీ ఆస్తుల వేలం!
* పరస్పర పొగడ్తలు..
నారాయణ విద్యాసంస్థల అధినేత మంత్రి నారాయణ( Minister Narayana) అన్న సంగతి తెలిసిందే. అయితే నారాయణ విద్యాసంస్థల బాధ్యతలనుంచి తప్పుకున్నట్లు నారాయణ ఎప్పుడో ప్రకటించారు. అయితే మంత్రి నారాయణ కుమార్తె ఇటీవల ఒక బుక్ రాశారు. ఆ బుక్ ఆవిష్కరణకు చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరు ఒకరికొకరు పొగడ్తలతో ముంచేత్తుకున్నారు. చంద్రబాబు ముందు చూపు కలిగిన నాయకుడని, మార్గదర్శకుడు అని కొనియాడారు చిరంజీవి. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనే కాకుండా.. నిజజీవితంలో సైతం నిరంతర సేవకుడు అని అభివర్ణించారు చంద్రబాబు. అయితే మెగాస్టార్ చిరంజీవి పొగడ్తలపైనే సోషల్ మీడియాలో ఎక్కువ అభ్యంతరాలు వస్తున్నాయి.
* అప్పట్లో తీవ్ర విమర్శలు..
2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం( Praja Rajyam ) ఏర్పాటు చేసిన సంగతి తెలుసు. అప్పట్లో అధికార పార్టీగా వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఉంది. మరోవైపు అధికారంలోకి వచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. మిగతా పార్టీలతో మహాకూటమి కట్టింది. సరిగ్గా అదే సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో అప్పటి అధికార కాంగ్రెస్ తో పాటు టిడిపిని సైతం చిరంజీవి టార్గెట్ చేశారు. అప్పట్లో చంద్రబాబును ఉద్దేశించి చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటు నాయకుడిగా అభివర్ణించారు. అవినీతిపరుడు అని ఆరోపించారు. తాజాగా చంద్రబాబు పై చిరంజీవి పొగడ్తలు కురిపించిన తరుణంలో ఈ పాత వీడియోలను తెరపైకి తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ వీడియోలను జత చేస్తున్నారు. వాటిని చూస్తున్న నెటిజెన్లు చిరంజీవి తీరును తప్పుపడుతున్నారు. రాజకీయాలను వదిలిపెట్టిన చిరంజీవి రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
* మెగా ఫ్యామిలీ యూ టర్న్
ఇటీవల మెగా కుటుంబం చంద్రబాబు( Chandrababu) విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తోంది. గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అయితే మొన్నటి ఎన్నికలకు ముందు టిడిపి తో జనసేన పొత్తు కుదిరిన తర్వాత మెగా ఫ్యామిలీ అభిప్రాయం మారుతూ వచ్చింది. చిరంజీవి సైతం కూటమికి మద్దతు ప్రకటించారు. సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అటు మెగా బ్రదర్ నాగబాబు సైతం చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే గతంలో మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు చంద్రబాబు విషయంలో భిన్న వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. వారి స్వరంలో ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. ఇప్పుడు దానిపైనే చర్చ జరుగుతోంది.
Also Read: కడపలో వైసీపీ నేతలతో అదృశ్య శక్తి.. బిజెపి ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు!