MLA Adinarayana Reddy : కూటమిలో బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి( MLA adinarayana Reddy ) వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పరిశ్రమల యాజమాన్యాల వద్ద హవా చలాయిస్తోందని ఆదినారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సిమెంట్ ఫ్యాక్టరీల వద్ద పనులన్నీ తమవారికి కట్ట పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కడప జిల్లాలో ఆయన ప్రాతినిధ్య వహిస్తున్న జమ్మలమడుగులో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి పనులు అప్పగించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. ఇప్పటికీ అక్కడ వైసిపి పెద్దల మాట చెల్లుబాటు అవుతోందని ఆదినారాయణ రెడ్డి వాదిస్తున్నారు. అయితే పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం ఇంకా పనులకు సంబంధించిన కాంట్రాక్టుకు గడువు ఉందని.. అది ముగిసిన వెంటనే మీవారికి అప్పగిస్తామని వారు చెబుతున్నారు.
Also Read : అండమాన్ లో టిడిపి జెండా!
* తొలుత జెసి ప్రభాకర్ రెడ్డితో గొడవ..
అయితే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెబుతున్న మాటలపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కూటమి పార్టీలు ఆయన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో అనంతపురం సీనియర్ నాయకుడు జెసి ప్రభాకర్ రెడ్డితో( JC Prabhakar Reddy) గొడవ పెట్టుకున్నారు ఆదినారాయణ రెడ్డి. అప్పట్లో కూడా ఓ ఓ పరిశ్రమకు సంబంధించి ముడి సరుకు విషయంలోనే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసేదాకా పరిస్థితి వచ్చింది. చివరకు ముఖ్యమంత్రి కార్యాలయం కలుగు చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీల వద్ద పనులకు సంబంధించిన కాంట్రాక్టుల విషయంలో ప్రశ్నిస్తున్నారు ఆదినారాయణ రెడ్డి. వైసీపీని నియంత్రించేందుకేనని ఆయన చెబుతున్నారు. ఇప్పటికీ ఆ ఫ్యాక్టరీల వద్ద వైసీపీ నేతల మనుషులు ఉన్నారని చెప్పుకొస్తున్నారు. అందుకే తను అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నానని.. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని హెచ్చరిస్తున్నారు.
* సీఎం రమేష్ పై పరోక్ష ఆరోపణలు..
అయితే వైసిపి నేతలకు అదృశ్య శక్తి సాయం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు ఆదినారాయణ రెడ్డి. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్( CM Ramesh) ఇప్పుడు బీజేపీలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. ప్రస్తుతం అనకాపల్లి ఎంపీగా ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్ మధ్య వివాదాలు నడుస్తున్నాయి. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆదినారాయణ రెడ్డి అదృశ్య శక్తి అని అభివర్ణించడం, ఎక్కడో ఉండి ఇక్కడ శాసించడం ఏంటని వ్యాఖ్యానించడం వంటివి సీఎం రమేష్ ను ఉద్దేశించినవేనని తెలుస్తోంది. ఈ విషయంలో వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆదినారాయణ రెడ్డి వైసీపీ నేతలతో అదృశ్యశక్తి చేతులు కలిపిందని ఆరోపణలు చేయడం మాత్రం సంచలనం రేకెత్తిస్తోంది.
* రాయలసీమ బిజెపి నేతల ఫిర్యాదు..
వాస్తవానికి ఆదినారాయణ రెడ్డి తీరుపై బీజేపీ నేతలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. కూటమి పార్టీలు సైతం ఆయన విషయంలో సానుకూలంగా లేవు. ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆయన మాటే చెల్లుబాటు అవుతోంది. టిడిపి నేతలను ఆయన లెక్కలోకి తీసుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు సీఎం రమేష్ తో గొడవ పెట్టుకున్న నేపథ్యంలో.. రాయలసీమకు చెందిన బిజెపి నేతలు ఆదినారాయణ రెడ్డికి వ్యతిరేకంగా హై కమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మొత్తానికైతే ఏపీ బీజేపీలో ఆదినారాయణ రెడ్డి వెర్సెస్ సీఎం రమేష్ అన్నట్టు పరిస్థితి మారింది.