Sajjala Sridhar Reddy : ఏపీలో వరుసగా వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) నేతల అరెస్టు జరుగుతోంది. ముఖ్యంగా వైసిపి హయాంలో మద్యం కుంభకోణం పై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ తరుణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దూకుడుగా ఉంది. మొన్నటికి మొన్న ఈ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్టు జరిగింది. ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉండగా.. ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇటీవల వరకు కనిపించకుండా పోయిన శ్రీధర్ రెడ్డిని హైదరాబాదులో పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ తీసుకువచ్చారు. ఈరోజు ఆయనను కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. అయితే సజ్జల శ్రీధర్ రెడ్డి ఇప్పటివరకు పెద్దగా ఈ పేరు వినిపించలేదు. కానీ ఈయన సజ్జల రామకృష్ణారెడ్డికి సమీప బంధువు అని తెలియడం మాత్రం సంచలనం కలిగిస్తోంది.
Also Read : వైసిపి మాజీ ఎంపీ ఆస్తుల వేలం!
* వరుస కీలక అరెస్టులు..
మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి ( Raj kasireddy )అరెస్టు తర్వాత ఇదే కీలక అరెస్ట్. ఈ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ6 గా ఉన్నారు. అయితే మద్యం కుంభకోణంలో శ్రీధర్ రెడ్డిని వసూల్ రాజా అని కూడా పిలుస్తుంటారని తెలుస్తోంది. గత ఐదేళ్లలో మద్యం తయారీ కంపెనీలు కమీషన్లు చెల్లించేలా బెదిరించే బాధ్యత సజ్జల శ్రీధర్ రెడ్డిది అని రాజ్ కసిరెడ్డి విచారణలో తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి ఏ1 గా ఉండగా, ఆయన తోడల్లుడు చాణుక్య అరెస్టయ్యారు. ఈ కేసులో చాణుక్య ఏ 8 గా ఉన్నారు. గత కొన్నాళ్లుగా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సజ్జల శ్రీధర్ రెడ్డి కదలికలపై దృష్టి పెట్టారు. శుక్రవారం ఆయన ఆచూకీ గుర్తించారు. హైదరాబాదులో అరెస్టు చేశారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి సమీప బంధువు అరెస్ట్ అయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమైంది.
* 2019లో జనసేన అభ్యర్థిగా..
గత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడుగా ఉన్నారు సజ్జల శ్రీధర్ రెడ్డి( Sridhar Reddy). సజ్జల రామకృష్ణారెడ్డికి ఈయన సమీప బంధువు. ఆపై మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి అల్లుడు. ఎస్పీవై రెడ్డికి చెందిన ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలంలోని తుమ్మలపల్లి ఈయన గ్రామం. 1997లో ఇంజనీరింగ్ చదివే సమయంలో ఎస్పీవై రెడ్డి కుమార్తెతో ప్రేమ వివాహం జరిగింది. 2019 ఎన్నికల్లో నంద్యాల నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు శ్రీధర్ రెడ్డి. అంతకుముందు 2012లో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. క్రియాశీలకంగా మారి మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా నిలిచారు.
* వసూలు రాజా..
సిట్ దర్యాప్తునకు( special investigation team) సంబంధించి రిమాండ్ రిపోర్టులో సజ్జల శ్రీధర్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే హైదరాబాద్ తాజ్ కృష్ణలో.. శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఒక భేటీ జరిగింది. మద్యం డిస్తులరీస్ యజమానులను రప్పించి.. కమీషన్ల కోసం బెదిరింపులకు దిగారని సిట్ రిపోర్టులో పేర్కొంది. దీనికి అంగీకరించిన వారికి మాత్రమే మద్యం ఆర్డర్లు ఇచ్చేవారట. అయితే ప్రత్యేక ఈ కమీషన్ల పెంపు వెనుక శ్రీధర్ రెడ్డి పాత్ర ఉందనేది సిట్ గుర్తించింది. ప్రతినెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు శ్రీధర్ రెడ్డి వసూలు చేశారని తెలుస్తోంది. మొత్తానికైతే మద్యం కుంభకోణంలో వరుస అరెస్టులు జరుగుతుండడంతో నేతల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
Also Read : చంద్రబాబుపై చిరంజీవి పొగడ్తలు.. ప్రత్యర్థులకు టార్గెట్!