CM Chandrababu : విశాఖ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. వైసిపి ప్రభుత్వం విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ విశాఖపట్నం ప్రజలు కనీస స్థాయిలో కూడా ఆహ్వానించలేదు. ఉత్తరాంధ్ర ప్రజలు సైతం స్వాగతించలేదు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో విశాఖ కేంద్రంగా చాలా రకాల పరిణామాలు జరిగాయి. కొన్ని నిర్ణయాలు సైతం వైసీపీ సర్కార్ తీసుకోలేక పోయింది.ఇటువంటి తరుణంలో చంద్రబాబు కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు.ఉత్తరాంధ్ర పర్యటనకు నిన్న సీఎం చంద్రబాబు వచ్చిన సంగతి తెలిసిందే.శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం లోని ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్లపథకానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు.ఈరోజు రోడ్ల అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికను విజయనగరంలో ప్రారంభించాల్సి ఉంది.కానీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో విజయనగరం పర్యటన రద్దు అయ్యింది.ఈ తరుణంలో నేడు విశాఖలో చంద్రబాబు పర్యటించనున్నారు. మెట్రో కారిడార్ తో పాటుగా ఐటీ ప్రాజెక్టులు, పలు సంస్థల ఏర్పాటు పైన అధికారులతో సమీక్షించనున్నారు. పనిలో పనిగా రుషికొండ భవనాలను చంద్రబాబు సందర్శిస్తారని సమాచారం. ఈ భవనాల నిర్వహణ భారం పెరుగుతున్న సమయంలో.. వినియోగంపై ఏదో ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు విశాఖపట్నంలో కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.
* కీలక శాఖలపై సమీక్ష
విశాఖ జిల్లా తో పాటు నగరానికి సంబంధించి కీలక శాఖలపై సమీక్ష జరపనున్నారు చంద్రబాబు. జీవీఎంసీ, విఎంఆర్డిఏ, రెవెన్యూ, భోగాపురం విమానాశ్రయం ప్రధాన అంశాలుగా చేర్చారు. ఇవే కాకుండా మొత్తం 40 శాఖల నుంచి సంక్షిప్త నివేదికల కోరారు. ఐటీ పర్యాటకం, రహదారుల నిర్మాణం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రిషి కొండపై జగన్ సర్కార్ 500 కోట్లతో నిర్మించిన భవనాలను సైతం పరిశీలించే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. విశాఖ మెట్రో లైన్ గురించి ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రాజెక్టు పై సైతం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.
* ఏదో ఒక నిర్ణయం తప్పనిసరి
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రుషికొండ భవనాలు ఎక్కువగా చర్చకు వచ్చాయి. రాజకీయంగా కూడా దుమారం చెలరేగింది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ ఈ భవనాలను పరిశీలించారు. తాజాగా చంద్రబాబు పరిశీలించనున్నారు. వీటి నిర్వహణ, వినియోగం పై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాటి నిర్వహణకు రోజు వారి ఖర్చు లక్ష రూపాయలు దాటుతోందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఓ 100 మంది వరకు సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. దీంతో వీటిని ఎలా నిర్వహించాలి అనేది ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే చంద్రబాబు తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా? లేకుంటేఅధికారుల నుంచి నివేదిక తీసుకుంటారా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది