Jagan: ఇటీవల విశాఖలో రిషికొండ భవనాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. వైసిపి హయాంలో దాదాపు 500 కోట్ల రూపాయలతో భారీ భవంతులను నిర్మించిన సంగతి తెలిసిందే. రిషికొండ పర్యాటక ప్రాంతంలో పాత కట్టడాలను తొలగించి..రహస్యంగా వాటిని ఏర్పాటు చేశారు. పర్యావరణ నిబంధనలకు విఘాతం కలిగిస్తూ ఈ నిర్మాణాలు చేపట్టారని అభ్యంతరాలు ఉండేవి.కోర్టులో కేసులు సైతం నడిచాయి. అయినా సరే అప్పట్లో వైసీపీ సర్కార్ వెనక్కి తగ్గలేదు. భారీ రాజప్రసాదాలను తలదన్నే రీతిలో అక్కడ నిర్మాణాలు జరిపారు. వైసిపి విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కోసమేనని అప్పట్లో ప్రచారం జరిగింది. ఎన్నికలకు ముందు వైసీపీ సర్కార్ అదే మాదిరిగా సన్నాహాలు చేసింది.అయితే ఇంతలో వైసిపి అధికారం కోల్పోవడం..టిడిపి అధికారంలోకి రావడం జరిగిపోయింది. దీంతో అక్కడి నిర్మాణాలు బాహ్య ప్రపంచానికి తెలిసాయి. భారీ రాజా మహాల్ మాదిరిగా అక్కడి నిర్మాణాలు బయటపడ్డాయి.అక్కడ ప్రతి నిర్మాణం అద్భుతమే. దీంతో ఇది విమర్శలకు కారణమైంది. జగన్ ప్రభుత్వం ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఇలాంటి నిర్మాణాలు జరిపిందంటూ కూటమి ప్రభుత్వం ప్రచారం చేయడం ప్రారంభించింది.ఈ నిర్మాణాలను ఎలా వినియోగించుకోవాలని కూటమి సర్కార్ ఆలోచించింది. ఈ తరుణంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల కిందట ఈ నిర్మాణాలను పరిశీలించారు.ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు పరిశీలించారు. అక్కడ నిర్మాణాలను చూసి ఆశ్చర్యపడ్డారు. పూర్వం రాజులు, చక్రవర్తులు కూడా ఇలాంటి భవనాలను నిర్మించుకోలేదని సీఎం చంద్రబాబు అన్నారు. గుండె చెదిరిపోయే నిజాలు బయటకు వస్తున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితం కోసం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నాడు అనేది రి షికొండ భవనాలు చూశాక తెలిసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసమే వీటిని వాడుకుంటామని.. వీటిని చూసేందుకు ప్రజలకు సైతం అనుమతిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే దీనిపై అనుకూలంగా మలుచుకుని ప్రచారం చేసుకుంటోంది వైసిపి.
* సోషల్ మీడియాలో అదే ప్రచారం
అయితే సీఎం చంద్రబాబు అలా స్పందించేసరికి వైసీపీ సోషల్ మీడియా ఎంటర్ అయ్యింది. రిషి కొండపై భవనాలను కొండ చర్యలు విరిగి పడకుండా జపాన్ టెక్నాలజీ ఉపయోగించి నిర్మాణాలు చేపట్టినట్లు చెబుతోంది. అంతటితో ఆగకుండా అమరావతిలో వేలాది కోట్ల రూపాయలతో నిర్మాణాలను నాసిరకంగా జరిపిన విషయాన్ని ప్రస్తావిస్తోంది. భవన నిర్మాణ పనులు ఎలా చేయాలో జగన్ ను చూసి తెలుసుకో చంద్రబాబు అంటూ హితపాద చేస్తోంది. కూటమి ప్రభుత్వానికి చురకలాంటిస్తోంది. సోషల్ మీడియాలో అదే పనిగా ప్రచారం మొదలు పెట్టింది. దీనిపై టిడిపి తో పాటు జనసేన సోషల్ మీడియా సైతం కౌంటర్ ఇస్తోంది. ఇంత జరిగాక కూడా ప్రజలను మధ్య పెడుతున్నారు అంటూ మండి పడుతోంది.
* పొగడ్తలతో ముంచెత్తారట
చంద్రబాబు జగన్ వైఫల్యాన్ని బయటపెట్టారు. కానీ చంద్రబాబు జగన్ రెడ్డిని పొగిడారు అంటూ ప్రచారం చేసుకుంటుంది వైసిపి. చంద్రబాబు ఏమన్నారో వీడియోలు మాత్రం పెట్టడం లేదు. కానీ పొగిడారంటూ పేపర్ క్లిప్పులు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజాధనంతో ఆ భవనాల నిర్మించారన్నది వాస్తవం. కనీసం ఎందుకు నిర్మించారో చెప్పలేకపోవడం వాస్తవం. కనీసం ఇప్పుడు కూడా ఎందుకు వాటిని నిర్మించామో చెప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది. జపాన్ టెక్నాలజీని తెచ్చి కొండ చరియలు పడకుండా కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఇలాంటివి ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తులే చేస్తారని చంద్రబాబు మండిపడిన విషయాన్ని మాత్రం వైసీపీ చూపించడం లేదు. మొత్తానికైతే చంద్రబాబు నోటి నుంచి వచ్చిన తిట్ల దండకాన్ని కూడా.. దీవెనలు అనుకొని వైసీపీ మురిసిపోవడం గమనార్హం.