CM Chandrababu: ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గత ఐదేళ్ల కాలంలో సొంత పార్టీ నేతలు విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారు. అధికారుల విషయంలో కూడా వివక్ష ప్రదర్శించారు. అంతులేని విజయాలతో తప్పుల మీద తప్పులు చేశారు. తప్పు చేస్తూ ప్రభుత్వంపై మచ్చ తెచ్చేవారిని దూరం పెట్టలేదు. అల్లరి చేసే నాయకులను కట్టడి చేయలేకపోయారు. అందుకే జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. పార్టీతో పాటు ప్రభుత్వంలో క్రమశిక్షణ కట్టు దాటితే పరిస్థితి ఎలా ఉంటుందో చేసి చూపించారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ రాజీనామాను ఆదేశించారు. చేసిన వెంటనే ఆమోదముద్ర వేశారు. వివాదానికి కారణమైన ఐఏఎస్ అధికారిపై బదిలీ వేటు వేశారు. ఎక్కడ పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. తాజా చర్యల ద్వారా గీత దాటితే.. పార్టీ నేతలైనా, అధికారులు అయినా చర్యలు తప్పవని స్పష్టమైన హెచ్చరికలు పంపగలిగారు. జాగ్రత్తగా ఉండాలని సంకేతాలు ఇచ్చారు.
* కొద్ది నెలల కిందటే బాధ్యతలు
కొద్ది నెలల కిందట ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా జీవి రెడ్డి ( AP fibernet chairman gv reddy )బాధ్యతలు స్వీకరించారు. స్వతహాగా న్యాయవాది ఆయన. ప్రశ్నించే తత్వం ఉంది. ఈ తరుణంలో జీవి రెడ్డి, అధికారుల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ఈ క్రమంలోనే విషయం తన దాకా రాగానే చంద్రబాబు జీవి రెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. సలహాలు సూచనలు ఇచ్చారు. అయితే దీనిని ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు గానీ జీవి రెడ్డి.. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో పాటు టిడిపి ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం వదులుకున్నారు. ఈ లేఖ అందగానే సీఎం చంద్రబాబు కూడా క్షణం ఆలస్యం చేయలేదు. వెంటనే ఆమోదముద్ర వేశారు. జీవి రెడ్డి ఎపిసోడ్ ను అంతటితో ముగించారు.
* ఎండి పై బదిలీ వేటు
మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండిగా ఉన్న ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్( IAS officer Dinesh Kumar) పై బదిలీ వేటు వేశారు. ఒకే ఒక్క నిర్ణయంతో దినేష్ కుమార్ నిర్వహణలోని అన్ని సంస్థలకు విముక్తి కల్పించారు. ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండితో పాటుగా రియల్ టైం గవర్నెన్స్ కు సీఈఓ గా, గ్యాస్, డ్రోన్స్ కార్పొరేషన్ లకు ఎండిగాను ఆయన కొనసాగుతున్నారు. అన్ని పోస్టుల నుంచి ఆయనను రిలీవ్ చేశారు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. దీంతో అటు ఫైబర్ నెట్ విభాగానికి సైతం ముగింపు పలికారు సీఎం చంద్రబాబు.
* ఈ ఒకే ఒక్క ఉదంతంతో..
అయితే ఈ ఒక్క ఉదంతంతో చంద్రబాబు( Chandrababu) పార్టీ నేతలతో పాటు అధికారులకు స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు. జీవి రెడ్డి రాజీనామా ఆమోదం, ఎండి దినేష్ పై బదిలీ వేటు ఒకేసారి చేసి.. క్రమశిక్షణ తప్పితే పరిస్థితి ఇలానే ఉంటుందని అందరికీ హెచ్చరించేలా చర్యలు చేపట్టారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలానే చేసి ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.