CM Chandrababu: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. మరో మూడు నెలల్లో ఏడాది పాలన పూర్తవుతుంది. కానీ సంక్షేమ పథకాలు మాత్రం ఇంతవరకు పట్టాలెక్కలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని పెంచి అమలు చేశారు. మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయగలిగారు. రాష్ట్రవ్యాప్తంగా 200 అన్న క్యాంటీన్ లను ప్రారంభించారు. అంతకుమించి సంక్షేమం అనేది వినిపించడం లేదు. దీనిపై విమర్శలు కూడా ప్రారంభం అవుతున్నాయి. ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి వినిపిస్తోంది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు దిగుతోంది. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. జగన్ సర్కార్ 10 లక్షల కోట్లు అప్పులు చేసిందని.. అప్పులు తీర్చేందుకే అప్పులు చేయాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ప్రజలకు ఎంతో చేయాలని ఉందని.. గల్లా పెట్టే ఖాళీగా ఉందని.. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడం విశేషం.
* ఐదేళ్లుగా కొనసాగిన పథకాలు
గత ఐదేళ్ల వైసిపి( YSR Congress ) పాలనలో సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచి సంక్షేమ పాలన ప్రారంభం అయింది. 2024 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు సంక్షేమం కొనసాగింది. అయితే ఈ ఎన్నికల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి హామీలు ఇవ్వకపోతే.. ప్రజలు యూటర్న్ కారని చంద్రబాబు భావించారు. అందుకే సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. రెట్టింపు సంక్షేమం అని ప్రకటనలు చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పారు. కానీ ఇప్పుడు 9 నెలలు అవుతున్న ఒక్క పథకం అమలు చేయలేకపోయారు. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.
* సంపద సృష్టి మాటేంటి
ఈ ఎన్నికలకు ముందు చంద్రబాబు ( Chandrababu)సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తామో వివరించే ప్రయత్నం చేశారు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ నాడు ఈ రాష్ట్రానికి సుదీర్ఘంగా పాలించిన సీఎంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎన్నికల్లో హామీలు ఇచ్చారు కనుక అమలు చేయాల్సిందేనని.. సంపద సృష్టిస్తామన్న మాట ఎటు వెళ్లిపోయిందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే పదే పదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చంద్రబాబు చెబుతుండడం మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఆయన రాజకీయంగా సీనియర్. పాలనాపరంగా అనుభవజ్ఞుడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా హామీలు ఎలా ఇచ్చారు అన్నది ఇప్పుడు ప్రశ్న.
* త్వరలో ఏపీ బడ్జెట్
అయితే త్వరలో బడ్జెట్( ap budget) ప్రవేశపెట్టనున్నారు. అందులో కీలక పథకాలకు సంబంధించి కేటాయింపులు చేయనున్నారు. ముఖ్యంగా రైతులకు సాగు ప్రోత్సాహం కింద అన్నదాత సుఖీభవ 3 విడతల్లో అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి తొలి విడత మేలో అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇంకోవైపు విద్యా సంవత్సరం ప్రారంభం జూన్లో తల్లికి వందనం పేరిట పిల్లల చదువు కోసం.. 15వేల రూపాయలు చొప్పున అందించేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నారు. ఇంకోవైపు ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించడానికి నిర్ణయించారు. ఈ మూడు కీలక పథకాలు కావడంతో.. వైసీపీని ట్రాప్ చేసేందుకు చంద్రబాబు ఇలా ఆర్థిక ఇబ్బందులపై మాట్లాడుతున్నారని.. రాష్ట్రం ఆర్థికంగా నష్టాల్లో ఉన్న పథకాలు అందించగలిగామని చెప్పుకునేందుకేనని అనుమానాలు ఉన్నాయి. చూడాలి మరి ఇందులో చంద్రబాబు వ్యూహం ఏంటో..