Nara Lokesh: రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ వేడుకగా జరుగుతోంది. పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 65.31 లక్షల మంది లబ్ధిదారులకు ఈరోజు పింఛన్లు అందించనున్నారు. సాయంత్రంలోగా శత శాతం అందించేందుకు నిర్ణయించారు. ఇచ్చిన హామీ మేరకు 4వేల రూపాయలకు పింఛన్ మొత్తం పెంచడంతో పాటు ఏప్రిల్ నుంచి వర్తింపజేశారు. మొత్తం 7000 రూపాయల నగదును అందజేశారు. ఇది లబ్ధిదారుల్లో ఆనందం నింపే అంశం. అమరావతి ప్రాంతంలోని పెనుమాకలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొదటి కార్యక్రమం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కార్యక్రమం సక్సెస్ కావడంతో లోకేష్ ను అభినందిస్తూ చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు.
మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ఉంది పెనుమాక గ్రామం. పింఛన్ల పంపిణీ సందర్భంగా చంద్రబాబు ఓ లబ్ధిదారుడు గుడిసెకు వెళ్లారు. కుటుంబ సభ్యులను పలకరించారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు ఏం చదువుతున్నారని ప్రశ్నించారు. ఇంకా బాగా చదవాలంటే ప్రోత్సహించారు. తల్లిదండ్రులను కష్టపెట్టకూడదని పిల్లలకు సూచించారు.లబ్ధిదారుల నుంచి పూర్తిగా సంతృప్తి రావడంతో చంద్రబాబు సైతం సంతోషించారు.ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని.. ఆర్థికంగా ఆదుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటారని చంద్రబాబు ఆ లబ్ధిదారుడి కుటుంబానికి భరోసా ఇచ్చారు. మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు అంటూ నారా లోకేష్ ను ప్రశంసించారు.
2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన లోకేష్ ఓడిపోయారు. అప్పట్లో మంత్రిగా ఉంటూ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు ఓటమి తప్పలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా.. మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేశారు. ఏకంగా 90 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. అందుకే మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెనుమాకలో తొలి కార్యక్రమాన్ని ఆవిష్కరించారు చంద్రబాబు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కావడంతో చంద్రబాబు అభినందనలను లోకేష్ అందుకున్నారు.