CM Chandrababu: ఢిల్లీలో చంద్రబాబు మంత్రాంగం..

ప్రధాని మోదీతో చంద్రబాబు గంటసేపు భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. చంద్రబాబు సీఎం హోదాలో ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఎన్డీఏలో టిడిపి చేరిన సంగతి తెలిసిందే.

Written By: Dharma, Updated On : July 4, 2024 12:39 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తున్నారు. ఉదయం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు. అనంతరం ప్రధాని మోదీ వద్దకు వెళ్లారు. వీరిద్దరూ దాదాపు గంటసేపు ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.ప్రధానంగా అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు అండగా నిలవాలని కోరినట్లు తెలుస్తోంది. గత వైసిపి పాలనలో ఈ రెండు ప్రాజెక్టులు మరుగున పడిపోయాయని.. చేయూతనందించి గాడిన పెట్టాలని చంద్రబాబు మోడీని అడిగినట్లు సమాచారం. వీటికి తోడు జాతీయ రహదారులకు సంబంధించి పలు ప్రాజెక్టుల విషయం ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

ప్రధాని మోదీతో చంద్రబాబు గంటసేపు భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. చంద్రబాబు సీఎం హోదాలో ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఎన్డీఏలో టిడిపి చేరిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. అటు రాష్ట్రంలో సైతం బిజెపికి ఒక మంత్రి పదవి దక్కింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయంగా కంటే.. రాష్ట్ర ప్రయోజనాలే శ్రేయస్కరమని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2014 మాదిరిగా కాకుండా.. వీలైనంతవరకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే రాజకీయ అంశాల కంటే రాష్ట్ర ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల కోసం చంద్రబాబు ప్రధాని మోదీ ముందు కీలక ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాని సైతం సానుకూలంగా స్పందించినట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

తొలిసారిగా ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం లభిస్తోంది. ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఆయన వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరితోను, రెండు గంటలకు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోను, మధ్యాహ్నం 2.45 గంటలకు హోం మంత్రి అమిత్ షా తోను చంద్రబాబు భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

రేపు కూడా చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం, 10 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్,10.45గంటలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా,మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్రమంత్రి అథావాలేతో భేటీ కానున్నారు. తరువాత పలువురు పారిశ్రామికవేత్తలు, విదేశీ రాయబారులతో సమావేశమవుతారు. ఎల్లుండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ సందర్భంగా చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళనున్నారు.