Mega brother Nagababu :ఏపీలో నామినేటెడ్ పదవుల సందడి ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్న నేపథ్యంలో.. వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు పలుమార్లు డిప్యూటీ సీఎం పవన్ తో చర్చించారు. మూడు పార్టీల కూటమి నేపథ్యంలో ఒక ఫార్ములాను అనుసరించి నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నారు. జనసేనకు సైతం అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో ఆ పార్టీలో ఆశావహులు సైతం పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి ఇస్తారని ప్రచారం ప్రారంభమైంది. ఏపీలో కూటమి మధ్య సమన్వయం, కూటమి తరుపున ప్రచారంలో నాగబాబు క్రియాశీలక పాత్ర పోషించారు. కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు నాగబాబు జిల్లాల వారీగా సమావేశాలు సైతం నిర్వహించారు. జనసేన శత శాతం విజయం సాధించడం వెనుక నాగబాబు కృషి కూడా ఉంది. అందుకే నాగబాబుకు కీలక పదవి ఇప్పించాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం నాగబాబు సినిమాలతో పాటు రాజకీయాలపై దృష్టి పెట్టారు. అందుకే సినిమా రంగానికి సంబంధించి పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే నాగబాబుకు కీలక పదవి ఖాయం. రకరకాల పదవులు తెరపైకి వచ్చినా.. చివరకు సినీ రంగానికి సంబంధించిన పదవి ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది.
* తొలుత టీటీడీ అధ్యక్ష పదవి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనకు టీటీడీ అధ్యక్ష పదవి ఇస్తారని టాక్ నడిచింది. దానిని నాగబాబు తోసిపుచ్చారు. తనకు ఆసక్తి లేదని సంకేతాలు ఇచ్చారు. దీంతో ఇంతకంటే పెద్ద పదవి కోరుకుంటున్నట్లు స్పష్టమైంది. అయితే నాగబాబు సినీ రంగానికి చెందినవారు కావడంతో.. అదే రంగానికి చెందిన పదవి కోరుకుంటున్నారని తెలుస్తోంది.
* తొలిసారిగా పోటీ చేసి ఓటమి
2019 ఎన్నికల్లో పోటీ చేశారు నాగబాబు. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయినా గణనీయమైన ఓట్లు సాధించారు. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని టాక్ నడిచింది. అందుకు తగ్గట్టుగా సన్నాహాలు కూడా చేసుకున్నారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటును బిజెపికి కేటాయించారు. దీంతో నాగబాబు సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారానికి పరిమితమయ్యారు. పొత్తులో భాగంగా మిగతా రెండు పార్టీలతో సమన్వయంగా వ్యవహరించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాగబాబుకు పదవి ఖాయమని ప్రచారం సాగింది.
* ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి
ఈరోజు నామినేటెడ్ పదవులను ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా నాగబాబును నియమిస్తారని తెలుస్తోంది. వైసిపి హయాంలో పోసాని కృష్ణ మురళి ఈ పదవిలో ఉండేవారు. అయితే ఆయన అప్పట్లో రాజకీయ విమర్శలకు పరిమితమయ్యారు. సినిమా రంగానికి సంబంధించి ఎటువంటి సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదు అన్న విమర్శ ఉంది. అందుకే ఆ పదవి తీసుకుని స్వతంత్రంగా వ్యవహరించాలని నాగబాబు భావిస్తున్నారు. ఇప్పటికే పవన్ ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పారు. నామినేటెడ్ పదవుల జాబితాలో నాగబాబు పేరు కూడా ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.