CM Chandrababu:  విసిగిపోయిన చంద్రబాబు.. తిరుగుబాటు చేయాలని ప్రజలకు సూచన

టిడిపికి చెందిన కొందరు నేతల వ్యవహార శైలి వివాదాస్పదం అవుతోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉంది. ఈ తరుణంలోనే చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. చాలాసార్లు హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో ప్రజలే తిరుగుబాటు చేయాలని సూచించారు.

Written By: Dharma, Updated On : October 26, 2024 5:24 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu:  వైసిపి హయాంలో కూటమి పార్టీల నేతలు గట్టి పోరాటమే చేశారు.ముఖ్యంగా ఇసుక, మద్యం అక్రమాలపై నిత్యం ఆందోళనలు చేసేవారు. అప్పటి వైసిపి ప్రజాప్రతినిధులతో పాటు నేతలపై విమర్శలు గుప్పించేవారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. ఒక్కో పాలసీ ప్రవేశ పెడుతూ వస్తోంది.ఇసుక, మద్యం పాలసీని ప్రకటించింది. అయితే ఇసుక పాలసీలో కొంత వ్యతిరేకత వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కొందరు ఎమ్మెల్యేలు ఇసుక విధానంలో తల దూర్చుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై చంద్రబాబు స్వయంగా హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో కొన్ని ఆదేశాలతో పాటు సూచనలు ఇచ్చారు చంద్రబాబు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారాన్ని కట్టబెట్టారని.. దానిని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయవద్దని సూచించారు చంద్రబాబు. అయినా సరే కొందరి తీరులో మార్పు రాలేదు.ప్రత్యేకంగా పిలిచి మరీ హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే వారి చర్యలతో విసిగివేసారి పోయిన చంద్రబాబు.. ఈరోజు గట్టి హెచ్చరికలే పంపారు. ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు అంటూ సొంత పార్టీ నేతలను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఎవరైనా ఇసుక దందా చేస్తే జనం తిరుగుబాటు చేయాలంటూ సలహా ఇచ్చారు. మద్యం సైతం ఎమ్మార్పీ ధరలకే అమ్మాలని ఆదేశించారు. మద్యం, ఇసుక విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. రూపాయి కూడా అవినీతి జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. గీత దాటితే ఎవరిని వదిలి పెట్టమని హెచ్చరించారు.

* ఇసుక విధానంలో విపరీత జోక్యం
ఇసుక విధానంలో కూటమి పార్టీల ఎమ్మెల్యేల విపరీత జోక్యం పై విమర్శలు వస్తున్నాయి. టిడిపి అనుకూల మీడియాలో సైతం పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఎమ్మెల్యేలు ఇసుక విధానంలో తల దూర్చుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు నేరుగా కలుగజేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే చాలా సందర్భాల్లో చంద్రబాబు హెచ్చరించారు కూడా. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం తో పాటు టిడిపి అంతర్గత సమావేశం కూడా నిర్వహించారు. ఆ సమావేశాల్లో కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎమ్మెల్యేలు పెడచెవిన పెడుతూ వచ్చారు. దీంతో చంద్రబాబు సైతం అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించిన నేపథ్యంలో మరోసారి హెచ్చరించారు చంద్రబాబు. ఈసారి ప్రజలే తిరుగుబాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం చంద్రబాబు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

* ప్రధానంగా టిడిపి వారిపైనే
ప్రస్తుతం మూడు పార్టీలు సంయుక్తంగా కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. కానీ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పైనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ఎన్నికల్లో ఖర్చు పెట్టామని.. ఇసుకలో కమిషన్ రాకుంటే ఎలా అని ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇసుక విధానంలో తలదూర్చితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చంద్రబాబుకు తెలుసు. మరోవైపు విమర్శలు గుప్పించడానికి వైసిపి రెడీగా ఉంది. ఈ తరుణంలోనే చంద్రబాబు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేల తీరు మారక పోవడంతో చంద్రబాబు ప్రజలకు నేరుగా సూచనలు చేయడం విశేషం. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు మారుతారో? లేదో? చూడాలి.