Transgender Hanna Rathod : అది పట్టుమని 200 కుటుంబాలు కూడా ఉండని ఓ చిన్న గ్రామం. నగర శివారులో ఉన్నా.. కాంక్రీటు జంగిల్ పోకడలు కనిపించవు. పాఠశాల విద్య స్వగ్రామంలో చదువుతూ బేల్దారి పనులు.. నగరంలో పండ్ల విక్రయిస్తూ తల్లిదండ్రులకు చేదోడు. చిరు ప్రాయం నుంచే శారీరక మార్పులతో సహా విద్యార్థుల చిన్నచూపు.. వ్యక్తి వెనుక సూటిపోటి మాటలు అవమానకర వ్యాఖ్యలు.. కట్ చేస్తే ప్రస్తుతం స్పెయిన్‌లో ఫార్మారంగ శాస్త్రవేత్త.. ట్రాన్స్ ఫ్యూజన్ శస్త్రచికిత్స తర్వాత ప్రపంచ దేశౠలు గుర్తించేలా మిస్ వరల్డ్ రన్నరప్.. ఇలా స్ఫూర్తిదాయక జీవనంతో ఎంతో మందికి ఆదర్శం. ఇదీ అనంతపురం జిల్లాకు చెందిన ట్రాన్స్ జెండర్ హాన్నా రాథోడ్ విజయ ప్రస్థానం. చదువులో ఆమె సాధించిన గెలుపు కుటుంబానేన కాదు.. ఏకంగా జిల్లా కీర్తి ప్రతిష్టలనే పెంచింది. అనంతపురం జిల్లా సోమలదొడ్డి గ్రామానికి చెందిన మల్లేశ్–పద్మావతి దంపతులకు మూడో సంతానం హన్నా రాథోడ్. ఆమెకు ఓ అన్న, అక్క ఉన్నారు. హన్నా రాథోడ్‌కు తల్లిదండ్రులు ఆనంద్‌బాబు అని పేరు పెట్టారు. తల్లిదండ్రులు తాడిపత్రి బస్టాండ్‌లో పండ్ల వ్యాపారం చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేశారు. ఆనంద్‌బాబు ఆరేళ్ల వయసులో ఉన్నపుడు శరీరంలో మార్పులు గుర్తించారు. సమాజానికి తెలిస్తే హేళన చేస్తారేమోనని ఎవరికీ చెప్పలేదు. చిన్నకొడుకు కావడంతో అమ్మానాన్న కూఏడా గారాబంగా పెంచారు.
గేలి చేసేవారు
సమాజంలో ట్రాన్స్ జెండర్లు ఎదుర్కొంటున్న వివక్ష ఆనంద్‌బాబు అలియాస్ హన్నా రాథోడ్‌ను ఇబ్బంది పెట్టింది. ఇలాంటి సమయంలో కేవలం చదువు ఒక్కటే సమస్యకు పరిష్కారం అని గుర్తించాడు. పట్టుదలగా చదువుకూంటూ క్లాస్‌లో టాపర్‌గా నిలుస్తూ వచ్చాడు. ఇంటర్ వరకూ ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే తెలుగు మీడియంలో చదివి.. తర్వాత అనంతపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీ ఫార్మసీ చేశాడు. అక్కడ చాలా మంది స్నేహితులు ముందు ఏమీ అనకపోయినా తర్వాత గేలి చేసేవారు. చెడుగా మాట్లాడేవారు. ఈ విషయాలు తెలిసి బాధపడిన ఆనంద్‌బాబు జన్యుపరమైన లోపాన్ని ఎవరూ గుర్తించలేదు. గేలి చేసినా కుంగిపోలేదు. పట్టుదలతో బీఫార్మసీ, ఎంఫార్మసీ పూర్తి చేశాడు.
పెళ్లి ప్రయత్నాల నుంచి బయటపడి..
ఎంఫార్మసీ పూర్తి చేసిన అనంతరం విదేశాల్లో ఎంఎస్ చేయాలని అనుకున్నాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దీంతో అనంతపురంలో ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా రెండేళ్లు పనిచేశాడు. అదే సమయంలో జూనియర్ ఫార్మసీ విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చిన డబ్బులను దాచుకుని విదేశీ అవకాళాలను అన్వేషిస్తూ వచ్చాడు. ఈలోపు అనంతపురం కలెక్టరేట్‌లో ఉద్యోగం వచ్చింది. దీంతో చాలా మంది అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి ముందుకు వచ్చారు. అయితే పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేయకూడాదని భావించి విదేశాలకు వెళ్లే పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేయవచ్చని అనుకున్నాడు. అదే సమయంలో విదేశీ విద్యావకాశాలపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షరాసి మెరుగైన ఫలితాలతో స్పెయిన్‌లో ఎంఎస్ సీటు దక్కించుకున్నాడు. కోర్సు పూర్తికాగానే అక్కడే బయో ఇంజినీరింగ్ సొల్యూషన్స్ శాస్త్రవేత్తగా పనిచేసే అవకాశం రావడంతో అక్కడే స్థిరపడ్డాడు.
2021లో ట్రాన్స్‌ఫ్యూజన్ సర్జరీ..
స్పెయిన్‌లో శాస్త్రవేత్తగా స్థిరపడిన ఆనందర్‌బాబు.. 2021లో ట్రాన్స్ ఫ్యూజన్‌గా ఆపరేషన్ చేసుకున్నాడు. తర్వాత తన పేరును హన్నా రాథోడ్‌గా మార్చుకుని ఇంట్లో వారికి విషయం చెప్పాడు. ఈ క్రమంలోనే స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో 2023లో మిస్ వరల్డ్ ట్రాన్స్–2023 పోటీలు జరిగాయి. అక్కడే శాస్త్రవేత్తగా పనిచేస్తున్న హన్నా రాథోడ్ ఈ విషయం తెలుసుకుని భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందకు ముందకు వచ్చింది. నిర్వాహకులు కూడా అవకాశం కల్పించారు. ఈ పోటీల్లో ఏకంగా రన్నరప్‌గా నిలిచింది. దీంతో ఆమెలో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. సేవా కార్యక్రమాలతో ట్రాన్స్ సమాజంలో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఓ కంపెనీని సంప్రదించగా, ట్రాన్స్ సమాజంలో దుర్భర జీవితం గడుపుతున్నవారికి సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది నవంబర్‌లో మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీలు ఢిల్లీలో జరుగనున్నాయి. ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా దక్కింది. దీంతో ఇటీవలే ఇండియాకు వచ్చిన హన్నా రాథోడ్.. పోటీల్లో విజేతగా నిలిచేందుకు సిద్ధమవుతోంది. స్వగ్రామానికి వచ్చినప్పుడు అందరూ కొత్తగా, గర్వంగా చూశారు. అందరూ ఆశీర్వదించారని తెలిపింది హన్నా రాథోడ్.