Chandrababu Oath Ceremony: మరికొద్ది గంటల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎం గా పవన్తో పాటు మరో 24 మంది మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటికే క్యాబినెట్ లో చోటు దక్కించుకున్న వారి జాబితాను ప్రకటించారు. సామాజిక సమతూకంతో పాటు అన్ని వర్గాలకు పెద్దపీట వేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ఫైళ్లపై సంతకం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఈ సంతకాల విషయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ రాష్ట్రానికి నాలుగోసారి సీఎం గా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. 25 మంది మంత్రులతో మంత్రివర్గం కొలువు దీరనుంది.
మరోవైపు ప్రమాణ స్వీకార వేడుకలకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఎప్పటికీ కేంద్ర ప్రముఖులు విజయవాడకు చేరుకున్నారు. ప్రమాణ స్వీకారానికి కొద్ది సమయం ముందు మోదీ రానున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఒడిశా వెళ్లనున్నారు. అక్కడ నూతన ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారని సమాచారం. అయితే ఈసారి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎటువంటి ప్రసంగాలు ఉండవని తెలుస్తోంది. ప్రధాని ప్రసంగం కూడా ఉండబోదని చెబుతున్నారు. ప్రమాణ స్వీకార అనంతరం అల్పాహార విందు ఏర్పాటు చేశారు. దీనికి ప్రధానిని కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాగా ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానం పలకనున్నారు. ప్రమాణ స్వీకార అనంతరం గన్నవరం ఎయిర్పోర్ట్ లో వీడ్కోలు చెప్పనున్నారు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మూడు ప్రధాన హామీలకు సంబంధించి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫైళ్లపై సంతకాలు చేయాలని నిర్ణయించారు. అయితే అందులో స్వల్ప మార్పులు జరిగినట్లు సమాచారం. సీఎం హోదాలో చంద్రబాబు గురువారం ఆ ఫైళ్లపై సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈరోజు కేవలం ప్రమాణ స్వీకార వేడుకల కు మాత్రమే పరిమితం కానున్నారు చంద్రబాబు. ఎటువంటి ప్రసంగాలు చేయరు. సంతకాలు పెట్టరని నిర్వాహకులు ప్రకటించారు. బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమల వెళ్ళనున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకొనున్నారు. అనంతరం 10 గంటల 45 నిమిషాలకు ఏపీ సచివాలయానికి చేరుకుంటారు. సీఎం కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరిస్తారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్ పై చంద్రబాబు సంతకం పెడతారు. ఆ తరువాత సామాజిక పింఛన్ 4వేల రూపాయలకు పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైళ్ళపై సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక వర్గాలు సైతం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.