Chandrababu Oath Ceremony: మరికొద్ది గంటల్లో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలోని కేసరపల్లిలో సువిశాల ప్రాంగణంలో ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ఈసారి ప్రమాణస్వీకారంలో సినీ సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి నాయకులు తరలివస్తున్నారు. నారా, నందమూరి, కొణిదెల కుటుంబాలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఆర్కే ఈవెంట్స్ ఈ వేడుకల నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. మరోవైపు అమరావతి సైతం కొత్త కళతో కనిపిస్తోంది.
ప్రముఖులు ఒక్కొక్కరుగా విజయవాడ చేరుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ముందుగానే విజయవాడ చేరుకున్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాదు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. నారా బ్రాహ్మణి, దేవాన్ష్, బాలకృష్ణ భార్య వసుంధర, ఇతర కుటుంబ సభ్యులు నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. వారికి మెగా అభిమానులు స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికే విజయవాడలో ల్యాండ్ అయ్యారు. అర్ధరాత్రి చంద్రబాబు నివాసానికి వెళ్ళిన వారు ప్రత్యేక విందులో కూడా పాల్గొన్నారు.
ఉదయం 10:30 గంటలకు ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కానున్నారు. అక్కడ నుంచి నేరుగా వ్యాసరపల్లిలోని ప్రమాణ స్వీకార వేదికకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 గంటల వరకు మోదీ అక్కడే గడపనున్నారు. ఆ తరువాత ఒడిస్సా బయలుదేరి వెళ్ళనున్నారు. కాగా ప్రమాణ స్వీకార వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీజేఐ ఎన్వి రమణ, జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు చిరాగ్ పశ్వాన్, నితిన్ గడ్కరీ, జితిన్ మాంజీ, జయంత్ చౌదరి, అనుప్రియ పటేల్, రాందాస్ ఆధవాలే, రకుల్ కుమార్ పటేల్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, మాజీ గవర్నర్ తమిళ్ సై సైతం రానున్నారు. బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ సిద్ధార్థ నాథ్ సింగ్ సైతం ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి టిడిపి, జనసేన, బిజెపి శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. ప్రమాణ స్వీకార అనంతరం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేపు ఏపీ సచివాలయంలో చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు.